Pemmasani: గుంటూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ యోగా పరిశోధన సంస్థ.. కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడి

Pemmasani Announces Yoga Research Institute in Guntur District
  • గుంటూరు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
  • రూ.94 కోట్ల వ్యయంతో యోగా, నాచురోపతీ కేంద్రానికి ఆమోదం
  • ప్రత్తిపాడు మండలం నెడింపాలెంలో 15 ఎకరాల్లో ఏర్పాటు
  • 100 పడకల ఆసుపత్రి, పరిశోధన కేంద్రం నిర్మాణం
  • గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిపోయిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని
గుంటూరు జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందడుగు పడింది. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం నెడింపాలెం గ్రామంలో సెంట్రల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నాచురోపతీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని వెల్లడించారు. సుమారు రూ.94 కోట్ల వ్యయంతో, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్రాంగణంలో 100 పడకల ఆసుపత్రి, పరిశోధన కేంద్రం, సిబ్బంది క్వార్టర్లు ఉంటాయని మంత్రి వివరించారు. ఈ సంస్థ ద్వారా ప్రజలకు నాణ్యమైన యోగా, ప్రకృతి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ముఖ్యంగా, తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ ఇక్కడ పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందిస్తారని, మధ్యతరగతి ప్రజలకు నామమాత్రపు ఛార్జీలతో చికిత్స ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా సుమారు 100 నుంచి 150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదం లభించినా, రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడంలో విఫలమవ్వడంతో రద్దయ్యే దశకు చేరుకుందని డాక్టర్ పెమ్మసాని ఆరోపించారు. తాము చొరవ తీసుకుని, అవసరమైన 15 ఎకరాల భూమిని కేటాయించి, ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించగలిగామని తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,  లోకేశ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Pemmasani
Guntur
Yoga Research Institute
Central Research Institute
Naturopathy
Andhra Pradesh
Narendra Modi
Chandra Babu Naidu
Prathipadu
Nedimpalem

More Telugu News