Revanth Reddy: అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంది... శ్రేణులు సిద్ధంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Confident Congress Will Rule for Next Decade
  • నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయన్న రేవంత్
  • 2029 ఎన్నికల నాటికి కొత్త నాయకత్వం సిద్ధం కావాలని వ్యాఖ్య
  • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపు
తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీదే అధికారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు వంటి కీలక మార్పులు రాబోతున్నాయని, వాటికి అనుగుణంగా కొత్త నాయకత్వం ఎదగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో జమిలి ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటివి రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయని తెలిపారు. దీనివల్ల అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకుని 2029 ఎన్నికల నాటికి నూతన నాయకత్వం సిద్ధంగా ఉండాలని సూచించారు.

యువ నాయకులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కష్టపడాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు. పార్టీ పదవులను తేలిగ్గా తీసుకోవద్దని, వాటితోనే రాజకీయంగా గుర్తింపు, గౌరవం లభిస్తాయని, భవిష్యత్తు ఎదుగుదలకు అవి పునాది వేస్తాయని స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వం విద్య, ఉద్యోగ రంగాల్లో ఎన్నో విజయాలు సాధించిందని, దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జనగణనలో కుల గణనను చేర్చేలా చేయడంలో విజయం సాధించామని గుర్తుచేశారు. పార్టీ శ్రేణులంతా మల్లికార్జున ఖర్గేను స్ఫూర్తిగా తీసుకుని, సమష్టిగా పనిచేసి రెండోసారి కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. 
Revanth Reddy
Telangana Congress
TPCC
Telangana Politics
Assembly Elections
Parliament Elections
Women Reservation
Constituency Reorganization
Jagananna Elections
Mallikarjun Kharge

More Telugu News