AI Technology: 18 ఏళ్ల నిరీక్షణకు తెర... ఏఐ టెక్నాలజీతో తల్లిదండ్రులు కాబోతున్న జంట!

AI Technology Helps Couple Conceive After 18 Years
  • సుదీర్ఘకాలంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులకు తీపి కబురు
  • భర్తకు అజూస్పెర్మియా సమస్యతో విఫలమైన ఐవీఎఫ్ ప్రయత్నాలు
  • ఏఐ ఆధారిత స్టార్ టెక్నాలజీతో అద్భుతం చేసిన కొలంబియా వర్సిటీ వైద్యులు
  • వీర్యంలో దాగి ఉన్న శుక్రకణాలను పట్టుకున్న కృత్రిమ మేధస్సు
  • ఈ విధానం ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా గర్భం దాల్చిన మహిళ
పద్దెనిమిదేళ్లుగా పిల్లల కోసం ఎదురుచూస్తున్న ఓ జంట నిరీక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ తెరదించింది. వైద్యరంగంలోనే ఇదొక అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. భర్తకు ఉన్న అరుదైన సమస్య కారణంగా ఎన్నో ఐవీఎఫ్ ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, సరికొత్త ఏఐ సాంకేతికత వారి కలను సాకారం చేసింది.

వివరాల్లోకి వెళితే... ఓ జంట 18 సంవత్సరాలుగా సంతానం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రులలో ఐవీఎఫ్ చికిత్సలు చేయించుకున్నారు. అయితే, భర్త అజూస్పెర్మియా అనే అరుదైన సమస్యతో బాధపడుతుండటంతో వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ సమస్య ఉన్నవారి వీర్యంలో శుక్రకణాలు కనిపించవు. దీంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈ క్రమంలో వారు కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ (సీయూఎఫ్‌సీ)ను ఆశ్రయించారు. అక్కడి వైద్యులు ఐదేళ్ల పరిశోధనతో అభివృద్ధి చేసిన 'స్టార్' (స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ) అనే ఏఐ ఆధారిత పద్ధతిని వారికి సూచించారు. ఈ టెక్నాలజీ ద్వారా, ప్రత్యేకమైన చిప్‌పై ఉంచిన వీర్య నమూనాను మైక్రోస్కోప్ కింద స్కాన్ చేస్తారు. గంటలోపే సుమారు 80 లక్షల చిత్రాలను తీసి, వాటిలో దాగి ఉన్న శుక్రకణాలను ఏఐ వ్యవస్థ కచ్చితంగా గుర్తిస్తుంది.

ఈ విధానంలో వైద్యులు సదరు వ్యక్తి వీర్య నమూనా నుంచి శుక్రకణాలను విజయవంతంగా గుర్తించి, వాటిని భార్య అండంతో ఐవీఎఫ్ ద్వారా ఫలదీకరణం చేశారు. ఫలితంగా, ప్రపంచంలోనే తొలిసారిగా ఈ పద్ధతి ద్వారా ఓ మహిళ గర్భం దాల్చారు. ఈ విషయంపై ఆ మహిళ ఆనందం వ్యక్తం చేస్తూ, "నేను గర్భవతినని నమ్మడానికి రెండు రోజులు పట్టింది. ఇప్పటికీ ఇది నిజమా కాదా అని అనిపిస్తోంది. స్కానింగ్ చూసేంతవరకు నమ్మలేకపోతున్నాను" అని తెలిపారు.

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ జెవ్ విలియమ్స్ మాట్లాడుతూ, "ఒక రోగి నమూనాను మా నిపుణులు రెండు రోజులు పరిశీలించినా ఒక్క శుక్రకణం కూడా దొరకలేదు. కానీ, ఏఐ స్టార్ సిస్టమ్ గంటలోనే 44 శుక్రకణాలను గుర్తించింది. ఇది వైద్యరంగంలో ఒక పెను మార్పు తీసుకువస్తుంది. రోగులకు ఎంతో మేలు చేస్తుంది," అని వివరించారు. ఈ విజయం అజూస్పెర్మియా వంటి సమస్యలతో బాధపడుతున్న ఎందరో దంపతులకు కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
AI Technology
Artificial Intelligence
Infertility Treatment
Azospermia
Columbia University Fertility Center
Sperm Tracking and Recovery STAR
IVF
Pregnancy
Dr Zev Williams
Fertility

More Telugu News