Mallikarjun Kharge: మేం మద్దతిచ్చినా.. పాకిస్థాన్‌తో యుద్ధాన్ని మోదీ ఆపేశారు: మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge Slams Narendra Modi for Stopping Pakistan War
  • హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభ
  • ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు
  • మణిపూర్‌కు వెళ్లని ప్రధాని 42 దేశాలు తిరిగారని ఎద్దేవా
  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకుంటోందని వెల్లడి
  • దేశంలో తొలిసారి కులగణన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టీకరణ
  • దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసిందని గుర్తుచేశారు
ఆపరేషన్ సిందూర్‌కు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌తో యుద్ధాన్ని మధ్యలోనే నిలిపివేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పాకిస్థాన్‌తో యుద్ధానికి తాము మద్దతు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో ఖర్గే ప్రసంగిస్తూ, ఇప్పటివరకు 42 దేశాల్లో పర్యటించిన ప్రధానమంత్రికి మంటల్లో కాలుతున్న మణిపూర్‌ను సందర్శించడానికి సమయం లేకపోవడం విచారకరమని అన్నారు. మణిపూర్ మన దేశంలో భాగం కాదా అని ప్రశ్నించిన ఆయన, అక్కడి ప్రజల బాధలను విన్న తర్వాతనే విదేశీ వ్యవహారాలపై దృష్టి సారించాలని మోదీకి సూచించారు.

గతంలో అమెరికా బెదిరించినా ఇందిరా గాంధీ భయపడలేదని, కానీ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్థాన్‌తో యుద్ధాన్ని మోదీ ఆపేశారని ఖర్గే ఆరోపించారు. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరైనా దేశం కోసం ప్రాణాలను అర్పించారా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ, అమిత్ షా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చిందని ఖర్గే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్‌ను ఓడించారని ప్రశంసించారు. కేసీఆర్ తన పాలనలో రైతులను, మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని ఖర్గే తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ. 8,200 కోట్లు జమ చేయడం, పేదలకు సన్న బియ్యం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. దేశంలోనే తొలిసారిగా కుల గణన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. గిగ్ వర్కర్ల హక్కుల కోసం చట్టం తీసుకువస్తున్నామని ఆయన వెల్లడించారు.
Mallikarjun Kharge
Narendra Modi
Pakistan War
Rahul Gandhi
Telangana Congress

More Telugu News