Dalai Lama: దలైలామా వారసుడి ఎంపిక: చైనాకు భారత్ కౌంటర్

Dalai Lama Successor China Receives Strong Counter From India
  • దలైలామా వారసుడి అంశంలో చైనాకు భారత్ గట్టి సమాధానం
  • అవి మతపరమైన విషయాలు, తాము జోక్యం చేసుకోబోమని స్పష్టీకరణ
  • కేంద్ర మంత్రి రిజిజు వ్యాఖ్యలతో భారత్‌ను హెచ్చరించిన చైనా
  • స్పందించిన భారత విదేశాంగ శాఖ
  • వారసుడిని గుర్తించే అధికారం తమ ట్రస్టుకే ఉందని చెప్పిన దలైలామా
  • భారత్‌లోని అందరి మత స్వేచ్ఛను గౌరవిస్తామని ప్రభుత్వం వెల్లడి
టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో అనవసర వ్యాఖ్యలు చేస్తున్న చైనాకు భారత ప్రభుత్వం గట్టిగా బదులిచ్చింది. అది పూర్తిగా మతపరమైన విషయమని, అందులో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇది తమ దీర్ఘకాలిక విధానమని, దానికే కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పింది.

ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్ మాట్లాడుతూ, "దలైలామా వారసత్వంపై వస్తున్న నివేదికలను మేం గమనించాం. ఇలాంటి మత విశ్వాసాలు, ఆచారాలకు సంబంధించిన విషయాల్లో భారత్ ఎప్పుడూ జోక్యం చేసుకోదు. దేశంలోని ప్రతి ఒక్కరి మత స్వేచ్ఛను ప్రభుత్వం గౌరవిస్తుంది. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తుంది" అని స్పష్టం చేశారు.

ఇటీవల కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దలైలామా వారసుడి ఎంపికపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన చైనా, టిబెట్ విషయాల్లో భారత్ తలదూర్చవద్దని పరోక్షంగా హెచ్చరించింది. ఈ జోక్యం ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది. చైనా చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే భారత ప్రభుత్వం తన అధికారిక వైఖరిని మరోసారి వెల్లడించింది.

మరోవైపు, తన వారసుడి ఎంపికపై ప్రస్తుత దలైలామా ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తన తర్వాత కూడా ఈ వారసత్వం కొనసాగుతుందని, తదుపరి గురువును గుర్తించే అధికారం కేవలం ‘గాడెన్‌ ఫోడ్రాంగ్‌ ట్రస్టు’కు మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో మరెవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని ఆయన ఇటీవలే చెప్పారు.
Dalai Lama
Dalai Lama successor
China
India
Tibet
Tibetan Buddhism
Religious freedom

More Telugu News