Love Bugs: దక్షిణ కొరియాలో 'లవ్ బగ్స్' విజృంభణ... అల్లాడిపోతున్న ప్రజలు!

Love Bugs Infestation in South Korea Alarms Residents
  • దక్షిణ కొరియాను ముంచెత్తిన 'లవ్‌ బగ్స్'
  • జంటలుగా తిరుగుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
  • వాతావరణ మార్పులే కారణమంటున్న నిపుణులు
  • లక్షల సంఖ్యలో పురుగులతో నిండిపోయిన ప్రాంతాలు
  • పురుగులను పట్టుకుని బర్గర్లు చేసుకుంటున్న వైనం
  • నివారణకు రంగంలోకి దిగిన ప్రభుత్వం
పేరులో 'ప్రేమ' ఉన్నా, వాటి చేతలు మాత్రం జనానికి నరకాన్ని చూపిస్తున్నాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్, దాని సమీపంలోని ఇంచియాన్ నగరం ప్రస్తుతం 'లవ్‌ బగ్స్' అనే కీటకాల వెల్లువతో అల్లాడిపోతున్నాయి. లక్షల సంఖ్యలో ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా కనిపిస్తూ, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.

గత కొన్ని వారాలుగా ఈ పురుగుల బెడద తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా రాజధానికి పశ్చిమాన ఉన్న గ్యేయాంగ్సాన్ పర్వత ప్రాంతంలో పరిస్థితి చేయిదాటిపోవడంతో, ప్రభుత్వం డజన్ల కొద్దీ సిబ్బందిని రంగంలోకి దించింది. హైకింగ్ చేసే మార్గాలన్నీ ఈ కీటకాలతో నిండిపోయి, నడవడానికి కూడా వీలులేకుండా తయారయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో, కొందరు ఈ పురుగుల గుంపుల మధ్య నుంచి అతి కష్టం మీద వెళ్లడం, మరికొందరు రోడ్లపై పేరుకుపోయిన పురుగుల కళేబరాలను తొలగించడం కనిపిస్తోంది. ఓ వ్యక్తి ఏకంగా వేలకొద్దీ పురుగులను సేకరించి, వాటితో బర్గర్లు చేసుకుని తింటున్న వీడియో కలకలం రేపింది.

శాస్త్రీయంగా 'ప్లేసియా లాంగిఫోర్సెప్స్' అని పిలిచే ఈ కీటకాలు, ఎగిరేటప్పుడు జంటగా ఒకదానికొకటి అతుక్కుని ఉండటంతో వీటికి 'లవ్‌ బగ్స్' అని పేరు వచ్చింది. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలే ఈ కీటకాలు ఉత్తర ప్రాంతాలకు, ముఖ్యంగా సియోల్ వైపు వ్యాపించడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. సియోల్‌లోని 'హీట్-ఐలాండ్ ఎఫెక్ట్' దీనికి మరింత ఆజ్యం పోస్తోంది.

ఈ పురుగులు మనుషులను కుట్టవని, వ్యాధులను వ్యాపింపజేయవని అధికారులు చెబుతున్నారు. ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయని, పూల పరాగ సంపర్కానికి సాయపడతాయని సియోల్ నగర ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఇవి ఇళ్ల గోడలకు, కార్ల అద్దాలకు, రెస్టారెంట్లకు అతుక్కుపోవడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఫిర్యాదుల సంఖ్య రెట్టింపు అయింది. దీంతో ప్రభుత్వం వీటి నివారణకు రసాయనాలకు బదులుగా నీటిని పిచికారీ చేయడం, జిగురు అట్టలను వాడాలని సూచిస్తోంది.

"వాతావరణ మార్పుల కారణంగా పర్యావరణ అస్థిరత పెరుగుతోంది, వేసవి అంతా అప్రమత్తంగా ఉండాలి" అని పర్యావరణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ కిమ్ టే-ఓ తెలిపారు. కాగా, పిచ్చుకలు వంటి పక్షులు ఈ పురుగులను తినడం నేర్చుకోవడంతో వాటి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని స్థానిక నివేదికలు చెబుతున్నాయి.
Love Bugs
South Korea
Seoul
Incheon
Platypalpus longicornis
insect infestation
heat-island effect
climate change
pest control
Gyeongsangsan Mountain

More Telugu News