West Godavari: మనిషి పళ్లతో రూప్‌చంద్‌ చేప.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Roopchand Fish With Human Like Teeth Found in West Godavari
  • పశ్చిమ గోదావరి జిల్లాలో మనిషి పళ్లతో రూప్‌చంద్‌ చేప
  • చూడటానికి అచ్చం మనిషి దవడలా ఉన్న పళ్ల వరుస
  • ఇది ప్రమాదకరమైన పిరాన్హా జాతికి చెందినదని వెల్లడి
  • ఏమరపాటుగా ఉంటే చేతివేళ్లను కొరికేస్తుందని హెచ్చరిక
  • పెంపకందారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సూచన
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వింత చేప అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాని నోరు తెరిచి చూస్తే అచ్చం మనిషి పళ్ల వరుస కనిపించడంతో చూసినవారు అవాక్కవుతున్నారు. ఈ చేప ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. మొగల్తూరు మండలం సుబ్రమణ్యేశ్వరం రోడ్డులోని ఓ చేపల చెరువులో ఈ రూప్‌చంద్‌ చేప కనిపించింది. దీని నోటిలోని పళ్ల వరుస అచ్చం మనిషి కింది దవడను పోలి ఉండటం విశేషం. చూడటానికి వింతగా ఉన్నా, ఇది చాలా ప్రమాదకరమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చేపలను పట్టే రైతులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఇది చేతివేళ్లను బలంగా కొరికేస్తుందని చెబుతున్నారు.

ఈ చేపపై నరసాపురం మత్స్య కళాశాల అసోసియేట్‌ డీన్‌ నీరజ కీలక వివరాలు వెల్లడించారు. రూప్‌చంద్‌ చేపలు ప్రమాదకరమైన పిరాన్హా జాతికి చెందినవని, ఇవి పూర్తిస్థాయి మాంసాహారులని ఆమె తెలిపారు. చెరువుల్లో వీటిని సాధారణంగా రెండు నుంచి మూడు కిలోల బరువు పెరిగే వరకు పెంచుతారని ఆమె వివరించారు. ఈ నేపథ్యంలో పెంపకందారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
West Godavari
Roopchand Fish
Strange Fish
Human Teeth Fish
Mogalthuru
Fish Farming
Piranha Fish
Fishermen Safety

More Telugu News