Revathi Mannepalli: అంతర్జాతీయ వేదికపై తెలుగు తేజం.. ఐటీయూ డైరెక్టర్ పదవికి ఏపీ మహిళ నామినేషన్

Revathi Mannepalli Nominated for ITU Director Post
  • ఐటీయూ బ్యూరో డైరెక్టర్ పదవికి భారత అభ్యర్థిగా రేవతి మన్నెపల్లి
  • ఆమె నామినేషన్‌ను అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి సింధియా
  • ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లూరుపేట రేవతి స్వస్థలం
  • గెలిస్తే ఈ పదవిని చేపట్టే తొలి మహిళగా చరిత్ర సృష్టించే అవకాశం
  • గతంలో ఇస్రో, బార్క్‌లలో కీలక సేవలు అందించిన రేవతి
అంతర్జాతీయ స్థాయిలో ఓ తెలుగు మహిళ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) రేడియో కమ్యూనికేషన్ బ్యూరో డైరెక్టర్ పదవికి భారత అధికారిక అభ్యర్థిగా రేవతి మన్నెపల్లిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కావడం విశేషం. ఈ పదవికి ఆమె ఎన్నికైతే, బ్యూరోకు నాయ‌క‌త్వం వహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారు.

ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధికారికంగా ప్రకటించారు. "2027-30 కాలానికి ఐటీయూ రేడియో కమ్యూనికేషన్ బ్యూరో డైరెక్టర్ పదవికి భారత అభ్యర్థిగా నామినేట్ అయిన రేవతికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె విజయం సాధించి, భారత విజన్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని సింధియా పేర్కొన్నారు. ఈ పదవికి సంబంధించిన ఎన్నికలు 2026లో జరగనున్నాయి.

రేవతి మన్నెపల్లి తన స్వగ్రామంలో తొలి ఇంజినీర్‌గా నిలిచి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కీలక పదవికి పోటీపడే స్థాయికి ఎదగడం ఆమె ప్రయాణానికి నిదర్శనం. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేసిన ఆమె, షార్‌లో ఇంజినీర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బార్క్‌లో శాస్త్రవేత్తగా కూడా సేవలందించారు.

గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో టెలికాం రంగంలో రేవతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆమె జెనీవాలోని ఇంటర్నేషనల్ రేడియో రెగ్యులేషన్ బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌లో జాయింట్ వైర్‌లెస్ అడ్వైజర్‌గా ఉన్నారు. 2017లో భారత్ ప్రయోగించిన దక్షిణాసియా శాటిలైట్‌కు ఆర్బిటల్ హక్కులు సాధించడంలో ఆమె కృషి ఎంతో ఉంది. 6జీ, స్పెక్ట్రమ్ పాలసీల రూపకల్పనలో కూడా భారత ప్రభుత్వానికి ఆమె సలహాలు అందిస్తున్నారు.
Revathi Mannepalli
ITU
International Telecommunication Union
Radio Communication Bureau
Jyotiraditya Scindia
Indian nominee
telecommunications
South Asia Satellite
6G spectrum
Department of Telecommunications

More Telugu News