Jackky Bhagnani: దివాలా వార్తలను ఖండించిన నటి రకుల్ ప్రీత్‌సింగ్ భర్త జాకీ భగ్నానీ

Jackky Bhagnani Denies Bankruptcy Rumors After Movie Failure
  • తాకట్టు పెట్టిన ఆఫీసును తిరిగి సొంతం చేసుకున్నానని వెల్లడి
  •  తినడానికి కూడా డబ్బుల్లేవంటూ తనపై ప్రచారం జరిగిందని ఆవేదన
  •  దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కు అవకాశమిచ్చి తప్పుచేశానని వ్యాఖ్య
  •  350 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 102 కోట్లే వసూలు చేసిన సినిమా
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ తన ఆర్థిక పరిస్థితిపై వస్తున్న వదంతులపై స్పందించారు. 'బడే మియా ఛోటే మియా' సినిమా భారీ నష్టాలను మిగల్చడంతో తాను దివాలా తీశానని, తినడానికి కూడా డబ్బుల్లేవంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రూమర్ల వెనుక ఎవరున్నారో తెలియదని, కానీ ఎవరినీ నిందించదలచుకోలేదని అన్నారు.

బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌లతో జాకీ భగ్నానీ నిర్మించిన 'బడే మియా ఛోటే మియా' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కేవలం రూ. 102 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ వైఫల్యం తర్వాత జాకీ ఆర్థికంగా చితికిపోయారని, తన జూహు ఆఫీసును అమ్ముకున్నారని ప్రచారం జరిగింది.

ఈ వార్తలపై జాకీ భగ్నానీ తాజాగా మాట్లాడుతూ "నేను దివాలా తీశానని, నా ఆఫీసును అమ్మేశానని, చివరకు తినడానికి కూడా డబ్బుల్లేవని రాశారు. నేను దేశం విడిచి పారిపోయానని కూడా ప్రచారం చేశారు. ఈ రూమర్స్‌ ఎక్కడ మొదలయ్యాయో నాకు తెలియడం లేదు. అయితే, నేను అమ్మేశానన్న ఆఫీసును తిరిగి సొంతం చేసుకున్నాను. ఈ విషయంలో ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు" అని స్పష్టం చేశారు.

అదే సమయంలో, 'బడే మియా ఛోటే మియా' సినిమా విషయంలో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కు అవకాశం ఇవ్వడం ఓ పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. సినిమా కోసం తన ఆస్తులు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చిందని గతంలో జాకీ చెప్పడం గమనార్హం.
Jackky Bhagnani
Rakul Preet Singh
Bade Miyan Chote Miyan
Akshay Kumar
Tiger Shroff
Bollywood
movie failure
bankruptcy rumors
Ali Abbas Zafar
Prithviraj Sukumaran

More Telugu News