Chinmayi Sripada: రేపిస్టులు ఎంపీలు అవుతుంటే లేని బాధ, రణ్‌బీర్‌పై ఎందుకు?: గాయని చిన్మయి

 Ranbir Kapoor Beef Controversy Chinmayi Sripada Slams Hypocrisy
  • 'రామాయణ'`లో రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్
  • బీఫ్ తినే నటుడంటూ ఓ నెటిజన్ తీవ్ర విమర్శ
  • విమర్శలపై ఘాటుగా స్పందించిన గాయని చిన్మయి
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘రామాయణం’ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించడంపై ఓ నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేయగా, అత్యాచారాలకు పాల్పడిన వారు ఎన్నికల్లో గెలుస్తున్నప్పుడు లేని బాధ, ఓ నటుడి ఆహారపు అలవాట్లపై ఎందుకంటూ ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కొత్త దుమారం రేగింది.

వివరాల్లోకి వెళితే.. ‘బీఫ్ తినే రణ్‌బీర్ రాముడి పాత్ర పోషించడమేంటి? మన కర్మ!’ అని ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన చిన్మయి, “దేవుడి పేరుతో ఓ బాబాజీ రేప్ చేస్తాడు... జైల్లో నుంచి బయటకు వచ్చి ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవొచ్చు... ఇదే భక్త్ ఇండియా. అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే అదేం పెద్ద సమస్య కాదు కదా?” అంటూ బదులిచ్చారు.

చిన్మయి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఆమెకు మద్దతు పలకగా, మరికొందరు విమర్శించారు. ‘ఒక చెడ్డ పనిని మరోదానితో ఎలా పోలుస్తారు?’ అని ఓ వ్యక్తి ప్రశ్నించగా, “రేపిస్ట్ ఎంపీగా గెలిస్తే మీకు ఏమీ అనిపించదు. కానీ బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్ర పోషిస్తే మాత్రం గుండెల్లో మంట. ఈ విషయంలో మీకేం అనిపించట్లేదా?” అని ఆమె ఎదురు ప్రశ్నించారు. తనను విమర్శించిన మరికొందరికి కూడా చిన్మయి తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.

కాగా, నితీశ్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాలు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 దీపావళికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
Chinmayi Sripada
Ranbir Kapoor
Ramayana movie
beef eating controversy
rape accused politicians
social media comments
Nitish Tiwari
AR Rahman
Hans Zimmer
Bollywood

More Telugu News