AI Model: ఆకస్మిక గుండెపోటు మరణాలకు ఏఐతో చెక్... అమెరికా పరిశోధకుల కీలక ఆవిష్కరణ

US researchers develop AI model improving sudden cardiac death prediction
  • ఆకస్మిక గుండె మరణాలను పసిగట్టే కొత్త ఏఐ మోడల్
  • ఎంఆర్‌ఐ స్కాన్లు, ఆరోగ్య రికార్డులతో రిస్క్ అంచనా
  • ప్రస్తుత విధానాల కన్నా అత్యంత కచ్చితమైన ఫలితాలు
  • యువతలో గుండెపోటుకు కారణమయ్యే జబ్బు గుర్తింపులో కీలకం
  • ప్రాణాపాయం నుంచి ఎంతోమందిని కాపాడే అవకాశం
ఆరోగ్యంగా ఉన్న యువత హఠాత్తుగా గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఆకస్మిక మరణాలను ముందే పసిగట్టి, ప్రాణాలను కాపాడేందుకు అమెరికా పరిశోధకులు ఒక విప్లవాత్మక కృత్రిమ మేధ (AI) మోడల్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న వైద్య మార్గదర్శకాల కన్నా ఇది ఎంతో కచ్చితమైన ఫలితాలను అందిస్తూ వైద్య రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించిన ఈ ఏఐ సిస్టమ్‌కు 'మార్స్' (MAARS - Multimodal AI for Ventricular Arrhythmia Risk Stratification) అని పేరు పెట్టారు. ఇది కార్డియాక్ ఎంఆర్‌ఐ చిత్రాలను, రోగి ఆరోగ్య రికార్డులను సమగ్రంగా విశ్లేషించి, గుండెలో దాగి ఉన్న ప్రమాద సంకేతాలను గుర్తిస్తుంది. ముఖ్యంగా వైద్యులకు సైతం గుర్తించడం కష్టంగా ఉండే గుండె కండరాల మచ్చల (స్కారింగ్) నమూనాలను ఇది డీప్ లెర్నింగ్ టెక్నాలజీతో విశ్లేషిస్తుంది.

ఈ పరిశోధన వివరాలు 'నేచర్ కార్డియోవాస్కులర్ రీసెర్చ్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. జన్యుపరంగా వచ్చే 'హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి' అనే గుండె జబ్బు ఉన్నవారిపై ఈ అధ్యయనం దృష్టి సారించింది. ప్రస్తుతం అమెరికా, ఐరోపాలో అనుసరిస్తున్న వైద్య మార్గదర్శకాలతో ప్రమాదాన్ని అంచనా వేయడంలో కచ్చితత్వం కేవలం 50 శాతంగా ఉంది. అయితే, 'మార్స్' మోడల్ ఏకంగా 89 శాతం కచ్చితత్వం చూపించింది. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ కచ్చితత్వం 93 శాతంగా ఉండటం విశేషం.

"ప్రస్తుత విధానాల వల్ల కొందరు యువత ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు అనవసరంగా డీఫిబ్రిలేటర్లతో జీవించాల్సి వస్తోంది. మా ఏఐ మోడల్ ద్వారా ఎవరికి ఎక్కువ ముప్పు ఉందో అత్యంత కచ్చితత్వంతో చెప్పగలం" అని సీనియర్ పరిశోధకురాలు నటాలియా ట్రయానోవా తెలిపారు. 

"ప్రస్తుత అల్గారిథమ్‌లతో పోలిస్తే ఈ ఏఐ మోడల్ మా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది వైద్య సంరక్షణలో మార్పు తీసుకురాగలదు" అని కార్డియాలజిస్ట్ జోనాథన్ క్రిస్పిన్ అన్నారు. ఈ మోడల్‌ను మరింత మంది రోగులపై పరీక్షించి, ఇతర గుండె జబ్బులకు కూడా విస్తరించాలని పరిశోధకుల బృందం యోచిస్తోంది.
AI Model
Natalia Trayanova
Sudden Cardiac Arrest
MAARS
Artificial Intelligence
Heart Disease
Hypertrophic Cardiomyopathy
Cardiac MRI
Jonathan Chrispin
Heart Attack Risk

More Telugu News