Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర: అల్పాహారం కోసం ఆగితే ప్రమాదం.. పలువురికి గాయాలు

Amarnath Yatra Bus Accident Injures Pilgrims in Ramban
  • అమర్‌నాథ్ యాత్ర కాన్వాయ్‌లో రోడ్డు ప్రమాదం
  • రాంబన్ జిల్లాలో ఒకదానికొకటి ఢీకొన్న ఐదు బస్సులు
  • ప్రమాదంలో 36 మంది యాత్రికులకు గాయాలు
అమర్‌నాథ్ యాత్రకు భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 36 మంది యాత్రికులు గాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న ఇతర బస్సులను వెనుక నుంచి ఢీకొట్టింది.  

వివరాల్లోకి వెళ్తే.. పవిత్ర అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్తున్న యాత్రికుల కాన్వాయ్ చందర్‌కోట్ ప్రాంతంలో అల్పాహారం కోసం ఆగింది. ఆ సమయంలో కాన్వాయ్‌లోని ఓ బస్సు నియంత్రణ కోల్పోయింది. దీంతో ముందు పార్క్ చేసి ఉన్న నాలుగు బస్సులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ఈ ప్రమాదంపై రాంబన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) కుల్బీర్ సింగ్ స్పందించారు. "చందర్‌కోట్‌లో అల్పాహారం కోసం కాన్వాయ్ ఆగింది. ఈ ప్రమాదంలో యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వారిలో చాలామంది యాత్రను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారు" అని ఆయన తెలిపారు. అయితే, "గాయాల తీవ్రత కారణంగా ముగ్గురు లేదా నలుగురు యాత్రికులు తమ యాత్రను ముందుకు కొనసాగించలేని పరిస్థితి ఉండవచ్చు" అని ఆయన వివరించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Amarnath Yatra
Amarnath
Yatra
Jammu Kashmir
Ramban
Chandrakote
Bus Accident
Pilgrims
Kashmir Pilgrimage
Road Accident

More Telugu News