Suraj Pal: పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. వరుడు సహా 8 మంది దుర్మరణం

Tragic accident kills groom Suraj Pal and 8 on way to wedding
  • యూపీలో పెళ్లి బృందం వాహనానికి ఘోర ప్రమాదం
  • మృతులలో ఇద్దరు చిన్నారులు కూడా
  •  అతివేగంతో కాలేజీ గోడను ఢీకొట్టిన బొలెరో వాహనం
  •   సంభాల్ జిల్లాలో మీరట్-బదౌన్ హైవేపై ఘటన
  •  మరో ఇద్దరి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు
పెళ్లి వేడుకకు వెళ్తున్న ఆ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు, ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో పెళ్లి జరగాల్సిన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

హర్‌గోవింద్‌పూర్ గ్రామానికి చెందిన సుఖ్‌రామ్ తన కుమారుడు సూరజ్ పాల్ (20) వివాహాన్ని బదౌన్ జిల్లాలోని సిర్సౌల్ గ్రామానికి చెందిన యువతితో నిశ్చయించారు. నిన్న సాయంత్రం పెళ్లి బృందంతో కలిసి దాదాపు 11 వాహనాలు బయలుదేరాయి. కాగా, వరుడు సూరజ్‌తో పాటు మరో తొమ్మిది మంది ప్రయాణిస్తున్న మహీంద్రా బొలెరో వాహనం కాస్త వెనుకబడింది.

మీరట్-బదౌన్ జాతీయ రహదారిపై జునావాయి పట్టణం సమీపంలోకి రాగానే బొలెరో వాహనం అతివేగంతో అదుపుతప్పి జనతా ఇంటర్ కాలేజీ ప్రహరీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక జేసీబీ సహాయంతో వాహనం భాగాలను తొలగించి క్షతగాత్రులను బయటకు తీశారు.

వెంటనే వారిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా, అప్పటికే ఎనిమిది మంది మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుల్లో వరుడు సూరజ్ పాల్‌తో పాటు రవి (28), ఆశ (26), సచిన్ (22), మధు (20), కోమల్ (15), ఐశ్వర్య (3), గణేష్ (2) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన హిమాన్షి, దేవ అనే మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి వేడుకకు బయలుదేరిన వారు మార్గమధ్యంలోనే మృత్యువాత పడటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Suraj Pal
Road accident
Uttar Pradesh
Sambhal district
Wedding party
Accident death
India news
Bolero accident
Meerut Baduan highway
Fatal crash

More Telugu News