Vanitha: సుపరిపాలనలో తొలి అడుగు... ధర్మవరంలో అప్పలరాజును పరామర్శించిన హోంమంత్రి అనిత

Vanitha Visits Appalaraju in Dharmavaram First Step in Good Governance
  • అనకాపల్లి జిల్లా ధర్మవరంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన
  • ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన పల్లా అప్పలరాజు
  • ధైర్యం చెప్పిన అనిత
  • 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమని వెల్లడి
  • పాయకరావుపేటలో స్టీల్ ప్లాంట్, టాయ్ పరిశ్రమలు రానున్నాయని ప్రకటన
ఏపీ హోంమంత్రి అనిత నేడు అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో ఆమె పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పల్లా అప్పలరాజును పరామర్శించి ధైర్యం చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నేత కలిగట్ల సూర్యనారాయణను కూడా అనిత పరామర్శించారు. అంతకుముందు, ఆమె గ్రామంలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక, 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. తాను ఎన్నికల కోసం రాలేదని, ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు వచ్చానని స్పష్టం చేశారు. ధర్మవరం గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.

గత ఐదేళ్ల పాలనలో గ్రామాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి విమర్శించారు. సర్పంచ్‌లకు కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనేందుకు కూడా నిధులు లేని దుస్థితి ఉండేదని అన్నారు. నాడు-నేడు పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని, ఎన్నో పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇందుకోసం 'ఈగల్' అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని హోంమంత్రి తెలిపారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. 

మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తున్నామని అనిత వెల్లడించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో త్వరలోనే స్టీల్ ప్లాంట్, టాయ్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆమె ప్రకటించారు. 
Vanitha
AP Home Minister
Andhra Pradesh
Dharmavaram
Palla Appalaraju
TDP Leader
Free Bus Travel
Ganja Control
Eagle Task Force
Steel Plant

More Telugu News