Amaravati: అమరావతికి మరో 20 వేల ఎకరాలు... సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్

Amaravati CRDA Approves Acquisition of 20000 Acres
  • సీఎం చంద్రబాబు నివాసంలో ముగిసిన సీఆర్డీఏ 50వ సమావేశం
  • రాజధానిలో అదనంగా 20,494 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం
  • హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్లకు ఆర్ఎఫ్‌పీ పిలిచేందుకు గ్రీన్ సిగ్నల్
  • నగరంలో నాలుగు కొత్త కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఓకే
  • నిర్మాణ పనుల కోసం ఇసుక డ్రెడ్జింగ్‌కు సీఆర్డీఏకు అనుమతి
  • గోపీచంద్ అకాడెమీ, ఎమ్మెస్కే ప్రసాద్ అకాడెమీ సహా 16 సంస్థలకు భూ కేటాయింపులు
రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాజధాని పరిధిలో అదనంగా 20 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అథారిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని నివాసంలో జరిగిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో మొత్తం 7 ప్రధాన అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగా అమరావతి, తుళ్లూరు మండలాల్లోని ఏడు గ్రామాల్లో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించాలన్న ప్రతిపాదనకు అథారిటీ పచ్చజెండా ఊపింది. దీంతో పాటు, రాజధానిలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించేందుకు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మందడం, రాయపూడి, పిచుకలపాలెం వంటి ప్రాంతాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్లు, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఆర్ఎఫ్‌పీ) పిలిచేందుకు అనుమతించారు.

అంతేకాకుండా, అమరావతిలో నిర్మించనున్న ఫైవ్‌స్టార్ హోటళ్లకు సమీపంలో నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్లను నిర్మించే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. రాజధాని నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు, ప్రకాశం బ్యారేజీ ఎగువన డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుకను తవ్వుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. రానున్న రెండేళ్లలో నిర్మాణాలకు 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు.

కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు సీబీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ, ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడెమీ, కిమ్స్ హాస్పిటల్ సహా 16 ప్రముఖ సంస్థలకు 65 ఎకరాల భూమిని కేటాయించేందుకు కూడా సీఆర్డీఏ అంగీకరించింది. వీటితో పాటు రాజధానిలోని ఈ-15 రహదారిపై ఆరు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి, పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు కూడా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Amaravati
CRDA
Andhra Pradesh Capital
Land Acquisition
Chandrababu Naidu
Capital Region Development Authority
Real Estate Amaravati
AP Government
Amaravati Construction
P Narayana

More Telugu News