Raj Thackeray: ముంబైలో ఇన్వెస్టర్ కార్యాలయంపై రాజ్ థాకరే పార్టీ కార్యకర్తల దాడి.. సోషల్ మీడియా పోస్టే కారణం

Raj Thackeray Party Attack on Mumbai Office After Social Media Post
  • మరాఠీ భాషపై రాజ్ థాకరేను సవాల్ చేసిన ఇన్వెస్టర్ సుశీల్ కేడియా
  • మరాఠీ నేర్చుకోనంటూ 'ఎక్స్'లో వివాదాస్పద పోస్ట్
  • ఆగ్రహంతో ముంబైలోని కేడియా ఆఫీసుపై ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడి
  • వెంటనే దిగొచ్చి క్షమాపణలు చెప్పి, ట్వీట్ తొలగించిన కేడియా
  • రాజ్ థాకరేకు తాను వీరాభిమానినంటూ వ్యాఖ్యలు
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరేకు సామాజిక మాధ్యమం వేదికగా సవాల్ విసిరిన ఒక ఇన్వెస్టర్, ఆ తర్వాత పరిణామాలతో వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడమే కాకుండా, తాను రాజ్ థాకరేకు వీరాభిమానినని ప్రకటించారు. ఈ ఘటన ముంబైలో చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్రలో నివసించే ప్రతి ఒక్కరూ మరాఠీ భాష నేర్చుకోవాలని రాజ్ థాకరే చేసిన వ్యాఖ్యలపై ఇన్వెస్టర్ సుశీల్ కేడియా 'ఎక్స్'లో స్పందిస్తూ, "నేను 30 ఏళ్లుగా ముంబైలోనే ఉంటున్నాను, కానీ నాకు మరాఠీ సరిగా రాదు. మరాఠీ నేర్చుకునే ఉద్దేశం కూడా లేదు. ఏం చేస్తారో చెప్పండి?" అంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం ఉదయం కొందరు ఎంఎన్ఎస్ కార్యకర్తలు ముంబైలోని సుశీల్ కేడియా కార్యాలయానికి చేరుకుని రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాజ్ థాకరేకు, మరాఠీ భాషకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే సుశీల్ కేడియా తన వివాదాస్పద ట్వీట్‌ను తొలగించి, క్షమాపణలు కోరారు.

"మానసిక ఒత్తిడి కారణంగానే ఆ విధంగా స్పందించాను. మరాఠీ రాదన్న కారణంతో జరుగుతున్న హింసాత్మక ఘటనలు చూసి ఆవేశానికి లోనయ్యాను" అని కేడియా వివరణ ఇచ్చారు. రాజ్ థాకరే ఎన్నో కీలక అంశాలను ప్రస్తావిస్తారని, ప్రజల సమస్యలపై నిలబడే సత్తా ఆయనకు ఉందని ప్రశంసించారు. తాను ఆయనకు వీరాభిమానినని పేర్కొన్నారు. గతంలో థానేలో మరాఠీ మాట్లాడలేదని ఒక దుకాణదారుడిపై జరిగిన దాడిని కూడా కేడియా ఖండించారు.
Raj Thackeray
Maharashtra Navnirman Sena
MNS
Sushil Kedia
Mumbai
Marathi Language

More Telugu News