Radha: వివాహేతర సంబంధం: భర్తను చంపి.. గుండెపోటు నాటకం ఆడిన భార్య

Radha Murders Husband Over Extra Marital Affair in Bachupally
  • వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
  • బాచుపల్లిలో మద్యం మత్తులో ఉన్న భర్త గొంతు నులిమి చంపిన భార్య
  • సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలకు విఫలయత్నం
  • గొంతుపై గాయాలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన బంధువులు
  • విచారణలో నేరం అంగీకరించిన నిందితురాలు రాధ
  • నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
హైదరాబాద్ నగర శివారు బాచుపల్లిలో ఒక దారుణ సంఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను భార్య అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఆపై ఏమీ ఎరగనట్టు నటించి, సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే, బంధువులకు అనుమానం రావడంతో ఆమె నేరం బయటపడింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అంజిలప్ప, రాధ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి బాచుపల్లిలో ఒక నిర్మాణ సంస్థలో కూలీలుగా పనిచేస్తూ అక్కడే గుడిసెలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో రాధకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలుసుకున్న భర్త అంజిలప్ప ఆమెను పద్ధతి మార్చుకోవాలని, ప్రియుడితో ఫోన్లో మాట్లాడవద్దని పలుమార్లు మందలించాడు.

భర్త మందలించడంతో రాధ అతడిపై కోపం పెంచుకుని, అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. జూన్ 22న రాత్రి అంజిలప్ప మద్యం మత్తులో ఉండగా, అదే అదనుగా భావించి గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం తన భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించి, అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని స్వగ్రామమైన నారాయణపేటకు తరలించింది.

అంత్యక్రియల సమయంలో రాధ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు మృతదేహాన్ని పరిశీలించగా, అంజిలప్ప గొంతుపై గాయపు గుర్తులు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, రాధను అదుపులోకి తీసుకుని విచారించారు. తమదైన శైలిలో ప్రశ్నించగా, వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కోపంతో తానే భర్తను హత్య చేసినట్లు రాధ నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Radha
Extra marital affair
Murder
Husband murder
Bachupally
Hyderabad crime

More Telugu News