Elon Musk: ట్రంప్‌తో విభేదాలు... కొత్త పార్టీని ప్రకటించిన మస్క్

Elon Musk Launches America Party Challenging Two Party System
  • అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్
  • 'అమెరికా పార్టీ' పేరుతో రాజకీయాల్లోకి ప్రపంచ కుబేరుడు
  • మాజీ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌తో విభేదాల నేపథ్యంలో నిర్ణయం
  • 2026 ఎన్నికల్లో కీలక శక్తిగా మారడమే లక్ష్యమన్న మస్క్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లో సంచలనానికి తెరలేపారు. దేశంలో పాతుకుపోయిన ద్విపక్ష రాజకీయ వ్యవస్థకు సవాలు విసురుతూ 'అమెరికా పార్టీ' పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. "అమెరికన్లకు మీ స్వేచ్ఛను తిరిగి ఇస్తాం" అనే నినాదంతో ఆయన ఈ కొత్త అడుగు వేశారు.

కొత్త పార్టీ ఏర్పాటుపై తాను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో నిర్వహించిన పోల్‌లో అత్యధికులు మద్దతు తెలిపారని మస్క్ వెల్లడించారు. "ప్రతి ముగ్గురిలో ఇద్దరు కొత్త పార్టీని కోరుకుంటున్నారు, మీరు కోరుకున్నట్లే అది వస్తుంది!" అని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ 2026లో జరిగే మధ్యంతర ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. రెండు నుంచి మూడు సెనేట్ స్థానాలు, 8 నుంచి 10 ప్రతినిధుల సభ స్థానాల్లో పోటీ చేసి, కీలక చట్టాలపై నిర్ణయాత్మక శక్తిగా మారడమే తమ లక్ష్యమని వివరించారు.

ఇటీవల  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన వివాదాస్పద 'బిగ్ బిల్'ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లులో విచ్చలవిడి ఖర్చులు ఉన్నాయని, దేశంలో ఉన్నది ఒక్కటే పార్టీ అని, అది 'పోర్కీ పిగ్ పార్టీ' అని ఘాటుగా విమర్శించారు. ఒకప్పుడు ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా, ప్రభుత్వ సామర్థ్య విభాగానికి (DOGE) సలహాదారుగా పనిచేసిన మస్క్, ఇప్పుడు ఆయనతో బహిరంగంగా విభేదించడం గమనార్హం.

అయితే, మస్క్ పార్టీ ప్రకటన చేసినప్పటికీ, ఇప్పటివరకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని అధికారికంగా నమోదు చేయలేదు. అమెరికాలో కొత్త పార్టీని స్థాపించడం అంత సులభం కాదు. ప్రతి రాష్ట్రంలోనూ కఠినమైన నిబంధనలు, లక్షలాది సంతకాల సేకరణ వంటి సవాళ్లు ఉంటాయి. మస్క్ వద్ద అపారమైన సంపద ఉన్నప్పటికీ, 'డువర్జర్ సూత్రం' ప్రకారం రెండు పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో మూడో పార్టీ ఓట్లను చీల్చడానికే పరిమితమవుతుందని, గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అడ్డంకులను అధిగమించి మస్క్ తన పార్టీని ఎంతవరకు ముందుకు నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Elon Musk
America Party
Donald Trump
US Politics
Federal Election Commission
2026 Elections
Mega Bill
Porky Pig Party
Third Party
Political Party

More Telugu News