BCCI: బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన వాయిదా!

BCCI India Tour of Bangladesh Postponed to September 2026
  • బంగ్లాదేశ్ – భారత్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ 2026 సెప్టెంబర్‌కు వాయిదా 
  • సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన బీసీసీఐ
అనుకున్నట్లే బంగ్లాదేశ్ - భారత్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ 2026 సెప్టెంబర్‌కు వాయిదా పడింది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వాస్తవానికి ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కొత్త తేదీలను ప్రకటించకపోయినా క్రికెట్ అభిమానులు ఎదురుచూసిన బంగ్లాదేశ్ పర్యటన మాత్రం వాయిదా పడింది.

బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్‌ను సెప్టెంబర్ 2026 వరకు వాయిదా వేయడానికి పరస్పరం అంగీకరించాయి. రెండు జట్ల షెడ్యూల్ సౌలభ్యాన్ని పరిగణలోకి తీసుకుని రెండు బోర్డుల మధ్య చర్చల ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సిరీస్ షెడ్యూల్‌ను తగిన సమయంలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.

అయితే, రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కారణంగానే ఆగస్టులో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్‌కు భారత జట్టును పంపేందుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం జట్టును పంపేందుకు అనుమతి ఇవ్వలేదని సమాచారం.

బంగ్లాదేశ్‌లో అలజడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిరీస్ వాయిదా వేసేందుకు బీసీసీఐ మొగ్గు చూపినట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే వాయిదాకు గల కారణాలను మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. ప్రస్తుతానికి సిరీస్‌ను రద్దు చేయకుండా ఏడాది వాయిదా వేసేందుకు బీసీసీఐ, బీసీబీ అంగీకరించాయి. 
BCCI
Bangladesh tour
India vs Bangladesh
Bangladesh Cricket Board
India cricket schedule
cricket series postponed
political unrest
India tour of Bangladesh
Bangladesh political situation
cricket news

More Telugu News