Mohammad Ali: 40 ఏళ్ల క్రితం హత్యలు.. పశ్చాత్తాపంతో ఇప్పుడు లొంగిపోయిన నిందితుడు!

Kerala Man Mohammad Ali Confesses to Murders Committed 40 Years Ago
  • కుటుంబంలో వరుస విషాదాలు
  • నాలుగు దశాబ్దాల క్రితం చేసిన హత్యలే కారణమని పశ్చాత్తాపం
  • వెంటాడిన అపరాధ భావం
  • పోలీసులకు చెప్పి లొంగిపోయిన నిందితుడు
నాలుగు దశాబ్దాల క్రితం తెలిసీ తెలియని తనంలో రెండు హత్యలు చేశాడు. పోలీసులు వాటి గుట్టు విప్పలేకపోయారు. దీంతో నిందితుడు తప్పించుకున్నాడు. ఆ తర్వాత వాటిని గురించి మర్చిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు మర్చిపోయినా అతడు మాత్రం ఆ అపరాధ భారాన్ని మోయలేకపోయాడు. కుటుంబంలో ఎదురవుతున్న వరుస కష్టాలకు నాడు చేసిన హత్యల పాపమే కారణమని భావించాడు. పశ్చాత్తాపంతో రగిలిపోయాడు. ఇక లాభం లేదని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేరళలో జరిగిందీ ఘటన. 

 పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొయ్‌కోడ్‌కు చెందిన మహమ్మదాలి (53) అనే వ్యక్తి నెల రోజుల క్రితం మలప్పురం జిల్లాలోని వెంగరా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తన పెద్ద కుమారుడు ప్రమాదంలో చనిపోవడం, చిన్న కుమారుడు తీవ్రంగా గాయపడటంతో పాటు కుటుంబంలో నిత్యం సమస్యలు ఎదురవుతుండటంతో.. తాను గతంలో చేసిన నేరాలే వీటికి కారణమని నమ్మాడు. ఇక ఆ రహస్యాన్ని దాచిపెట్టలేక పోలీసులను ఆశ్రయించి అసలు విషయం చెప్పేశాడు.

మహమ్మదాలి చెప్పిన వివరాల ప్రకారం 1986లో తనను తరచూ వేధిస్తున్న ఓ 20 ఏళ్ల యువకుడిని ఆత్మరక్షణ కోసం తన్నడంతో అతడు కాలువలో పడిపోయాడు. దీంతో భయంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. రెండు రోజుల తర్వాత వచ్చి చూడగా ఆ యువకుడు నీటిలో విగతజీవిగా కనిపించాడు. అప్పట్లో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు దానిని సాధారణ మరణంగా నమోదు చేసి కేసును మూసివేశారు.

ఆ తర్వాత 1989లో వెల్లయిల్ బీచ్‌లో మరో వ్యక్తిని హత్య చేసినట్టు కూడా మహమ్మదాలి ఒప్పుకున్నాడు. దీనిపై ఆరా తీసిన పోలీసులకు, ఆ సమయంలో అక్కడ ఓ గుర్తుతెలియని మృతదేహం దొరికిన మాట వాస్తవమేనని తేలింది. అయితే, ఆధారాలు లేకపోవడంతో ఆ కేసును కూడా అప్పట్లోనే మూసివేసినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఈ రెండు కేసులకు సంబంధించిన పాత ఫైళ్లను పోలీసులు తిరగదోడుతున్నారు. మహమ్మదాలి చెబుతున్న విషయాల్లో నిజానిజాలను నిర్ధారించుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Mohammad Ali
Kerala
murder confession
crime
police investigation
Vengara Police Station
Kozhikode
Malappuram
vellayil beach

More Telugu News