Kurakula Amaralingeswara Rao: మాలిలో తెలుగు వ్యక్తి కిడ్నాప్.. రంగంలోకి దిగిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Mali Kidnapping Kishan Reddy Seeks Help for Amaralingeswara Rao
  • మొత్తం ముగ్గురిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
  • బాధితులలో ఏపీకి చెందిన అమరలింగేశ్వరరావు
  • విడిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన కుటుంబం
  • తామే కిడ్నాప్ చేశామని ప్రకటించిన అల్ ఖైదా అనుబంధ సంస్థ
  • డిమాండ్లు వెల్లడించని ఉగ్రవాదులు.. కొనసాగుతున్న ఉత్కంఠ
  • రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయం
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయులను అపహరించారు. బాధితులలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూరాకుల అమరలింగేశ్వరరావు ఉండటంతో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో నివసిస్తున్న ఆయన కుటుంబం, తమ వారిని సురక్షితంగా విడిపించాలని కోరుతూ శనివారం కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.

ఈ విషయంపై కిషన్ రెడ్డి తక్షణమే స్పందించారు. మాలిలోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి, బాధితులను విడిపించేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడకకు చెందిన అమరలింగేశ్వరరావు 11 ఏళ్లుగా మాలిలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ప్రసాదిత్య కంపెనీ ద్వారా ఆయన అక్కడికి వెళ్లారు.

అమరలింగేశ్వరరావుతో పాటు కిడ్నాప్‌కు గురైన వారిలో ఒడిశాకు చెందిన పి. వెంకటరమణ, రాజస్థాన్‌కు చెందిన ప్రసాద్ ఉన్నట్టు తెలిసింది. జులై 1న బైక్‌లపై వచ్చిన సాయుధ మిలిటెంట్లు, ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి చొరబడి ముగ్గురినీ అపహరించుకుపోయారు. ఈ కిడ్నాప్ వెనుక తమ హస్తం ఉందని అల్ ఖైదా అనుబంధ సంస్థ 'జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమీన్' (జేఎన్‌ఐఎం) ప్రకటించుకుంది. అయితే, ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా ఉగ్రవాదుల నుంచి ఎలాంటి డిమాండ్లు రాకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. మరోవైపు, ఒడిశాకు చెందిన వెంకటరమణను కాపాడాలంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు.
Kurakula Amaralingeswara Rao
Mali
Kidnapping
G Kishan Reddy
Al Qaeda
JNIM
Indian Embassy
Naveen Patnaik
P Venkata Ramana
Diamond Cement Factory

More Telugu News