Vijay: హీరో విజయ్ కి స్నేహ హస్తం చాచిన అన్నాడీఎంకే

Vijay Invited to Join ADMK Alliance for Tamil Nadu Elections
  • డీఎంకేని ఇంటికి పంపేందుకు విజయ్ కలిసి రావాలన్న పళనిస్వామి
  • ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్ధి తానేనన్న పళనిస్వామి
  • ప్రతిపక్షాలన్నింటినీ కూటమిలో చేర్చుకోవడానికి సిద్దమని వెల్లడి
తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్‌కు అనూహ్య ఆహ్వానం లభించింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నా డీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి.. టీవీకే వ్యవస్థాపకుడు, హీరో విజయ్‌కు స్నేహ హస్తం అందించారు. ఎన్డీఏ కూటమిలోకి విజయ్ పార్టీని ఆహ్వానించారు.

స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలు కలిసి రావాలని పిలుపునిచ్చిన పళనిస్వామి.. నటుడు విజయ్ కలిసి వచ్చినా కలుపుకొని పోతామని అన్నారు. నిన్న పార్టీ ప్రచార లోగోను ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో డీఎంకే పార్టీని ఇంటికి పంపాలని ప్రతిపక్షాలన్నీ దృఢ నిశ్చయంతో ఉన్నాయని, అందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. డీఎంకే, బీజేపీలతో ఎన్నటికీ పొత్తు ఉండదని ప్రకటించిన నటుడు విజయ్‌ను కూటమిలోకి ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ప్రజా వ్యతిరేక డీఎంకే పార్టీని ఓడించాలనుకునే ప్రతిపక్షాలన్నింటినీ కూటమిలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పళనిస్వామి పేర్కొన్నారు.

ఇప్పటికే టీవీకే సీఎం అభ్యర్థిగా విజయ్‌ను ప్రకటించిన విషయంపై ఆయన స్పందిస్తూ అది వారి పార్టీ నిర్ణయమని అన్నారు. తమిళనాడులో అన్నా డీఎంకే నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి ఎన్నికలకు వెళుతుందని స్పష్టం చేస్తూ తానే సీఎం అభ్యర్థినని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను గుర్తు చేశారు. పళనిస్వామి ప్రతిపాదనపై హీరో విజయ్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. 
Vijay
Tamil Nadu Elections
ADMK
Palani Swamy
TVK
DMK
NDA Alliance
Tamil Nadu Politics
Assembly Elections
Political Alliance

More Telugu News