Ali Khamenei: ఇజ్రాయెల్‌తో యుద్ధం తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

Ali Khamenei Appears Publicly After Israel Conflict
  • నెలల తర్వాత బహిరంగంగా కనిపించినఖమేనీ
  • టెహ్రాన్‌లో జరిగిన 'అషురా' కార్యక్రమంలో పాల్గొన్న నేత
  • ఇజ్రాయెల్‌తో వైమానిక దాడుల సమయంలో అజ్ఞాతంలోకి
  • ఖమేనీ ప్రత్యక్షంతో ఆయన ఆచూకీపై నెలకొన్న ఉత్కంఠకు తెర
నెలల తరబడి కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ప్రచారం జరిగిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బహిరంగంగా కనిపించారు. శనివారం టెహ్రాన్‌లో జరిగిన 'అషురా' మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొని, తన ఆచూకీపై నెలకొన్న ఊహాగానాలకు ముగింపు పలికారు.

ఇజ్రాయెల్‌తో జూన్ 13న మొదలైన 12 రోజుల వైమానిక యుద్ధం ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ దాడుల్లో పలువురు ఉన్నత సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు మరణించారు. ఈ క్లిష్ట సమయంలో ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. భద్రతా కారణాల రీత్యా ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన కేవలం ముందుగా రికార్డ్ చేసిన వీడియో సందేశాల ద్వారానే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో ఆయన భద్రతపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమైంది.

తాజాగా, షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన 'అషురా' రోజున టెహ్రాన్‌లోని ఓ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి ఖమేనీ హాజరయ్యారు. తన సంప్రదాయ నల్లని వస్త్రధారణలో ఆయన వేదిక వద్దకు నడిచి వస్తున్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. ఆ సమయంలో అక్కడున్న వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. ఈ పరిణామం ద్వారా దేశంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, నాయకత్వం బలంగా ఉందని చెప్పే ప్రయత్నం చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
Ali Khamenei
Iran Supreme Leader
Israel Iran conflict
Ashura
Tehran
Iran air strikes
Iran military
Shia Muslims
Middle East tensions

More Telugu News