Amit Ahirwar: ‘గోలీ చల్ జావేగీ’ పాటకు స్టెప్పులు.. నిజంగానే తుపాకీ పేల్చిన యువకుడు.. వీడియో ఇదిగో!

Goli Chal Javegi song leads to accidental shooting
  • ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ఓ వేడుకలో ఘటన
  • యువకుడి కాల్పుల్లో ఇద్దరు మహిళలకు గాయాలు
  • చట్టవిరుద్ధమైన నాటు తుపాకీతో హల్‌చల్
  • పరారీలో నిందితుడు, గాలిస్తున్న పోలీసులు
సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ కొందరు చేసే హంగామా కొన్నిసార్లు శ్రుతి మించుతుంది. ఉత్తరప్రదేశ్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వేడుకలో ‘గోలీ చల్ జావేగీ’ (తుపాకీ పేలుతుంది) అనే పాటకు డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు నిజంగానే తుపాకీ పేల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

మహోబా జిల్లాకు చెందిన కల్లు అహిర్వార్ ఇంట్లో శనివారం అర్ధరాత్రి 'కువాన్ పూజన్' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జానపద నృత్య ప్రదర్శన జరుగుతుండగా, ప్రేక్షకుల్లో ఉన్న అమిత్ అహిర్వార్ అనే యువకుడు ఒక్కసారిగా తన వద్ద ఉన్న నాటు తుపాకీని బయటకు తీశాడు. 'గోలీ చల్ జావేగీ' పాట ప్లే అవుతుండగా ఉత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపాడు.

అయితే, ఆ బుల్లెట్ గురితప్పి అక్కడే ఉన్న రాధ (21), రమ అనే ఇద్దరు మహిళల కాళ్లకు తగిలింది. దీంతో వేడుకలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. గాయపడిన వారిని వెంటనే మధ్యప్రదేశ్‌లోని నౌగాంగ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఛత్తర్‌పూర్‌కు రిఫర్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాధితుల్లో ఒకరి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అమిత్ అహిర్వార్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. వేడుకల్లో ఇలాంటి కాల్పులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Amit Ahirwar
Uttar Pradesh
Mahoba district
Goli Chal Javegi song
firing incident
wedding celebration
negligence
crime news
India news
gun violence

More Telugu News