Balwinder Singh: అమెరికా ఆశ.. కొలంబియా అడవుల్లో నరకం.. భారతీయ యువకులపై అమానుషం

Colombia Jungle Nightmare Balwinder Singh and Indian Migrants Tortured
  • అమెరికాకు డాంకీ రూట్‌లో వెళ్తూ కిడ్నాప్‌కు గురైన ఐదుగురు భారత యువకులు
  • కొలంబియా అడవుల్లో డబ్బుల కోసం ముఠా అమానుష హింస
  • కుటుంబసభ్యులకు టార్చర్ వీడియోలు పంపి కిడ్నాపర్ల బెదిరింపులు
  • కిరాతకంగా ముగ్గురిని చంపేసిన ముఠా, చావునుంచి తప్పించుకున్న ఇద్దరు
  • నలుగురు స్థానిక ట్రావెల్ ఏజెంట్లపై పోలీసులకు బాధితుల ఫిర్యాదు
  • యువకుడిని వెనక్కి రప్పించేందుకు రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం
అమెరికాలో అడుగుపెట్టాలన్న ఆశతో అక్రమ మార్గంలో బయలుదేరిన ఐదుగురు భారత యువకులు నరకం చూశారు. మానవ అక్రమ రవాణా ముఠా చేతిలో చిక్కి కొలంబియా అడవుల్లో చిత్రహింసలకు గురయ్యారు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు చావునుంచి త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.

పంజాబ్‌కు చెందిన నలుగురు, హర్యానాకు చెందిన ఒక యువకుడు ‘డంకీ రూట్’ ద్వారా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒకరైన కపుర్తలా జిల్లాకు చెందిన బల్విందర్ సింగ్ (25) కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చట్టబద్ధంగా పంపిస్తామని నమ్మించి నలుగురు ట్రావెల్ ఏజెంట్లు తమ వద్ద నుంచి రూ. 28 లక్షలు తీసుకుని మోసం చేశారని వారు ఆరోపించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బల్విందర్‌తో పాటు మిగిలిన యువకులను పనామా, కొలంబియా అడవుల్లో క్రియాశీలంగా ఉండే ‘డంకర్స్’ అనే ముఠా కిడ్నాప్ చేసింది. డబ్బుల కోసం వీరిని అమానుషంగా హింసించింది. ఇనుప రాడ్లతో కొట్టడం, కరెంట్ షాక్ ఇవ్వడం, పదునైన ఆయుధాలతో గాయపరచడం, ప్లాస్టిక్ కవర్లతో ఊపిరాడకుండా చేయడం వంటి ఘోరాలకు పాల్పడ్డారు. ఈ చిత్రహింసలకు సంబంధించిన భయానక వీడియోలను వారి కుటుంబసభ్యులకు పంపి డబ్బు డిమాండ్ చేశారు.

డబ్బు చెల్లించేందుకు కుటుంబాలు నిరాకరించడంతో, బందీలను చంపేయాలని ముఠా నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ముగ్గురిని హత్య చేశారని.. తాను, మరో యువకుడు మే 29న వారి చెర నుంచి తప్పించుకుని దట్టమైన అడవుల గుండా పారిపోయి ఓ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామని బల్విందర్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు.

ఈ ఘటనపై బల్విందర్ కుటుంబం స్థానిక ట్రావెల్ ఏజెంట్లయిన హర్భజన్ సింగ్, మల్కీత్ సింగ్, సోను, మరో బల్విందర్ సింగ్‌లపై కపుర్తలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు బల్బీర్ సింగ్ సీచెవాల్, ఈ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కొలంబియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించి, బల్విందర్‌కు కొత్త పాస్‌పోర్టు జారీ చేసి, భారత్‌కు తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Balwinder Singh
human trafficking
illegal immigration
Colombia
Punjab
Haryana
travel agents
kidnapping
torture
dunki route

More Telugu News