China Embassy London: లండన్ నడిబొడ్డున డ్రాగన్ కార్యాలయం.. భద్రతపై బ్రిటన్ ఆందోళన

China Embassy in London Sparks UK Security Concerns
  • లండన్‌లో చైనా నిర్మిస్తున్న భారీ ఎంబ‌సీపై వివాదం
  • కీలక ఆర్థిక కేంద్రం సమీపంలో ఏర్పాటుపై తీవ్ర ఆందోళన
  • గూఢచర్యం కోసమే ఈ నిర్మాణమని యూకే నిఘా వర్గాల అనుమానం
  • నిర్మాణంలో సొరంగాలు ఉన్నట్లు గతంలో వెలువడిన కథనాలు
  • ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేసిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్
లండన్‌లో చైనా నిర్మించ తలపెట్టిన భారీ దౌత్య కార్యాలయం బ్రిటన్‌కు తీవ్ర తలనొప్పిగా మారింది. కీలకమైన ఆర్థిక కేంద్రానికి అత్యంత సమీపంలో ఈ నిర్మాణం ఉండటంతో భవిష్యత్తులో గూఢచర్యం జరగవచ్చనే ఆందోళనలు యూకేలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై అక్కడి నిఘా వర్గాలతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

యూకే నిఘా సంస్థలైన ఎంఐ5, స్కాట్లాండ్‌ యార్డ్‌ గతంలోనే ఈ నిర్మాణంపై హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పుడు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కూడా ఈ విషయంపై నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి తమ అభ్యంతరాలను తెలియజేసింది. ఈ స్థలానికి అత్యంత సమీపంలోనే మూడు భారీ డేటా సెంటర్లు, స్టాక్‌ ఎక్స్ఛేంజి ఉండటమే ఈ ఆందోళనలకు ప్రధాన కారణం.

గతేడాది ఈ నిర్మాణంలో బేస్‌మెంట్‌ సూట్లు, సొరంగాలు ఉన్నట్లు వార్తలు రావడం కలకలం రేపింది. గూఢచర్యం కోసమే ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని 'డెయిలీ మెయిల్' పత్రిక తన కథనంలో పేర్కొంది. అంతేగాక భవనంలోని 'కల్చరల్ ఎక్స్ఛేంజి' విభాగాన్ని తనిఖీల నుంచి మినహాయించాలని చైనా కోరుతున్నట్లు సమాచారం. గూఢచర్య కార్యకలాపాలకు సాధారణంగా ఇలాంటి పేర్లను వాడుతారని అమెరికాకు చెందిన ఓ మాజీ భద్రతాధికారి చెప్పినట్లు కథనాలు వెల్లడించాయి.

లండన్ టవర్‌కు సమీపంలోని రాయల్ మింట్ ప్రాంతంలో ఉన్న 5.4 ఎకరాల చారిత్రక స్థలాన్ని చైనా 2018లో కొనుగోలు చేసింది. దీనిని ఐరోపాలోనే అతిపెద్ద దౌత్యకార్యాలయంగా నిర్మించాలని బీజింగ్ భావిస్తోంది. ఇది వాషింగ్టన్‌లోని చైనా ఎంబసీ కన్నా రెండు రెట్లు పెద్దది కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, కొన్ని నెలల క్రితం ఈ దౌత్యకార్యాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికంగా నిరసనలు కూడా జరిగాయి.
China Embassy London
UK China relations
London
MI5
Bank of England
espionage concerns
Royal Mint
data centers
security risks
foreign policy

More Telugu News