Marcus Trescothick: 24 గంటల్లోనే మాట మార్పు.. మేమేం మూర్ఖులం కాదన్న ఇంగ్లండ్ కోచ్

England Coach Marcus Trescothick Acknowledges Tough Challenge Against India
  • భారత్‌తో టెస్టులో ఓటమి అంచున నిలిచిన ఇంగ్లండ్
  • భారీ లక్ష్య ఛేదనలో గెలుపు మాట అటుంచి, డ్రాపై దృష్టి
  • డ్రా గురించి ఆలోచించనంత మూర్ఖులం కాదన్న బ్యాటింగ్ కోచ్ ట్రెస్కోథిక్
  • వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా కోచ్ స్పందన
దూకుడైన ఆటతీరు 'బజ్‌బాల్'తో టెస్ట్ క్రికెట్ స్వరూపాన్నే మార్చేస్తామని ప్రగల్భాలు పలికిన ఇంగ్లండ్, టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యం ముందు చతికిలపడే పరిస్థితిలో చిక్కుకుంది. ఇప్పటికే మూడు వికెట్లు పడిపోయాయి. గెలుపు మాట అటుంచి, కనీసం మ్యాచ్‌ను డ్రా చేసుకుంటే చాలనే స్థితికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. భారత్‌ నిర్దేశించిన ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదిస్తామని బీరాలు పలికిన వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌కు భిన్నంగా, కేవలం 24 గంటల వ్యవధిలోనే ట్రెస్కోథిక్ వాస్తవిక దృక్పథంతో మాట్లాడాడు.

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 536 పరుగులు చేయాల్సి ఉంది. ఇది దాదాపు అసాధ్యమన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రెస్కోథిక్ మాట్లాడుతూ... "ప్రతి టెస్టుకు గెలుపు, ఓటమి, డ్రాతో మూడు ఫలితాలు సాధ్యమే. ఈ మ్యాచ్‌లో డ్రా గురించి కూడా ఆలోచించలేనంత మూర్ఖులం కాదని నేను భావిస్తున్నా. ఇది ఎంత కఠినమైన సవాలో మాకు తెలుసు. టీమిండియా 550 పరుగుల లక్ష్యం నిర్దేశిస్తుందని అంచనా వేశాం, కానీ వాళ్లు 600 పైచిలుకు స్కోరు ఇచ్చారు. సానుకూల ఫలితం కోసమే ప్రయత్నిస్తాం. కానీ వాస్తవాలను విస్మరించలేం" అని ట్రెస్కోథిక్ స్పష్టం చేశాడు.

గతంలో ఉన్న జట్లతో పోలిస్తే, ప్రస్తుత డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం భిన్నంగా ఉంటుందని, అయినప్పటికీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆచరణాత్మకంగా ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అంగీకరించాడు. మరోవైపు, వర్షం పడి మ్యాచ్‌లో కొంత సమయం వృథా అవుతుందని ఇంగ్లండ్ ఆటగాళ్లు పెట్టుకున్న ఆశలపైనా నీళ్లు చల్లినట్లయింది. మ్యాచ్‌కు వరుణుడి నుంచి ఎలాంటి ముప్పు లేదని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. దీంతో భారత బౌలర్లను ఎదుర్కొని రోజంతా క్రీజులో నిలవడం ఇంగ్లండ్‌కు పెను సవాల్‌గా మారనుంది.
Marcus Trescothick
India vs England
England cricket
Edgbaston Test
Bazball
Test cricket
cricket coach
Harry Brook
cricket strategy
match draw

More Telugu News