Dalai Lama: కొనసాగుతున్న 'దలైలామా' వివాదం... మరోసారి చైనా నోట అదే మాట!

Dalai Lama Controversy Continues China Reiterates Position
  • పునర్జన్మపై దలైలామాకు అధికారం లేదన్న చైనా
  • 700 ఏళ్ల సంప్రదాయమని చైనా రాయబారి స్పష్టీకరణ
  • మతవిశ్వాసాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసిన భారత్
  • నిర్ణయం తీసుకునే హక్కు దలైలామాదేనన్న కేంద్ర మంత్రి రిజిజు
  • ఇది సాంస్కృతిక మారణహోమమేనని టిబెట్ ప్రవాస ప్రభుత్వం ఆరోపణ
టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా పునర్జన్మ అంశంపై మరోసారి వివాదం రాజుకుంది. ఈ విషయంలో దలైలామాకు ఎలాంటి అధికారం లేదని, ఆయనే తుది నిర్ణయం తీసుకోలేరని భారత చైనా రాయబారి జు ఫెయిహాంగ్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా వైఖరిపై భారత ప్రభుత్వం, టిబెట్ ప్రవాస ప్రభుత్వం తీవ్రంగా స్పందించాయి.

టిబెటన్ బౌద్ధమతంలో 'లివింగ్ బుద్ధాల' పునర్జన్మ అనేది 700 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఒక చారిత్రక, మతపరమైన సంప్రదాయమని జు ఫెయిహాంగ్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ వ్యవస్థను కొనసాగించాలా వద్దా అని నిర్ణయించే అధికారం 14వ దలైలామాకు లేదని ఆయన స్పష్టం చేశారు. చైనా చట్టాలు, మతపరమైన ఆచారాల ప్రకారమే పునర్జన్మ ప్రక్రియ జరగాలని చైనా విదేశాంగ శాఖ కూడా గతంలోనే తేల్చిచెప్పింది.

చైనా వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. మత విశ్వాసాలు, నమ్మకాలకు సంబంధించిన విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు. దలైలామా పునర్జన్మ పూర్తిగా మతపరమైన అంశమని, దీనిపై నిర్ణయం తీసుకునే హక్కు కేవలం ఆయనకు, బౌద్ధ సంప్రదాయాలకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇతరుల జోక్యానికి తావు లేదని ఆయన అన్నారు.

జూలై 6న దలైలామా 90వ పుట్టినరోజు జరుపుకుంటున్న తరుణంలో ఈ వివాదం మళ్లీ తెరపైకి రావడం గమనార్హం. ఇదిలా ఉండగా, చైనా చర్యలను టిబెట్ ప్రవాస ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. టిబెటన్ల గుర్తింపును చెరిపేసేందుకు చైనా "సాంస్కృతిక మారణహోమానికి" పాల్పడుతోందని ప్రవాస ప్రభుత్వ అధ్యక్షుడు పెన్పా త్సెరింగ్ ఆరోపించారు.
Dalai Lama
Dalai Lama reincarnation
China
Tibet
Tibetan Buddhism
India China relations
Penpa Tsering
Living Buddhas
Religious freedom
Chinese Foreign Ministry

More Telugu News