Kareena Kapoor: లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ 'ప్రాదా'పై కరీనా కపూర్ సెటైర్!

Kareena Kapoor Satires Prada Over Kolhapuri Chappal Design
  • కొల్హాపురి చెప్పుల డిజైన్‌ కాపీ వివాదంలో 'ప్రాదా' బ్రాండ్
  • ఇది 'ప్రాదా' కాదు, నా ఒరిజినల్ కొల్హాపురి అంటూ కరీనా పోస్ట్
  • లగ్జరీ బ్రాండ్‌పై సోషల్ మీడియా వేదికగా చురకలంటించిన నటి
  • భారతీయ డిజైన్‌ను కాపీ కొట్టారని ప్రాడాపై తీవ్ర విమర్శలు
  • చేతివృత్తి కళాకారులకు నష్టపరిహారం కోరుతూ హైకోర్టులో పిల్
  • విమర్శల నేపథ్యంలో భారతీయ స్ఫూర్తిని అంగీకరించిన 'ప్రాదా'
భారతీయ సంప్రదాయ కొల్హాపురి చెప్పుల డిజైన్‌ను కాపీ కొట్టిందన్న ఆరోపణలతో విమర్శలు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రాదా’పై బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఘాటుగా స్పందించారు. తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థకు చురకలంటించారు. ఆదివారం తన కాళ్లకు ఉన్న కొల్హాపురి చెప్పుల ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న కరీనా, "క్షమించండి, ఇది 'ప్రాదా' కాదు... నా అసలైన కొల్హాపురి" అంటూ ఓ సెటైరికల్ క్యాప్షన్ జోడించారు.

ఇటీవల 'ప్రాదా' సంస్థ మిలాన్‌లో నిర్వహించిన మెన్స్ స్ప్రింగ్/సమ్మర్ ఫ్యాషన్ షోలో 'టో రింగ్ శాండిల్స్' పేరుతో ఓ కొత్త మోడల్ చెప్పులను ప్రదర్శించింది. అయితే, వాటి డిజైన్ అచ్చం మన కొల్హాపురి చెప్పులను పోలి ఉండటంతో పెద్ద వివాదం చెలరేగింది. భారతీయ డిజైన్‌ను కాపీ కొట్టి, దానికి ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా సుమారు లక్ష రూపాయల ధరకు అమ్ముతున్నారంటూ 'ప్రాదా'పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో, కొల్హాపురి చెప్పుల తయారీదారుల హక్కులను కాపాడాలని, వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది.

విమర్శలు తీవ్రం కావడంతో ప్రాదా సంస్థ స్పందించింది. తమ చెప్పులు శతాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ చేతివృత్తి నైపుణ్యం నుంచి స్ఫూర్తి పొందినవేనని అంగీకరించింది. "ఆ భారతీయ కళా నైపుణ్యానికి ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యతను మేము ఎంతగానో గుర్తిస్తున్నాము" అని ప్రాదా గ్రూప్ ప్రతినిధి లోరెంజో బెర్టెల్లీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వివాదం సద్దుమణగక ముందే కరీనా కపూర్ చేసిన పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Kareena Kapoor
Prada
Kolhapuri chappals
fashion brand
Indian design
copy controversy
Bombay High Court
Lorenzo Bertelli
luxury fashion
mens spring summer 2026

More Telugu News