Rafale: రఫేల్ యుద్ధ విమానాలపై చైనా దుష్స్రచారం!

China Spreads Disinformation on Rafale Fighter Jets Says France
  • రఫేల్ విమానాలపై చైనా భారీస్థాయిలో దుష్ప్రచారం చేస్తోందని ఫ్రాన్స్ ఆరోపణ
  • రఫేల్ అమ్మకాలను అడ్డుకుని, చైనా జెట్లను ప్రోత్సహించడమే లక్ష్యం
  • వివిధ దేశాల్లోని చైనా రాయబారులు ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారని వెల్లడి
  • భారత రఫేల్స్‌ను కూల్చేశామన్న పాక్ వాదనలను చైనా వాడుకుంటోందని ఆరోపణ
  • ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసిన చైనా
తమ ప్రతిష్ఠాత్మక రఫేల్ యుద్ధ విమానాల అమ్మకాలను దెబ్బతీయడంతో పాటు, వాటి ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి చైనా భారీస్థాయిలో 'దుష్ప్రచార' యుద్ధం చేస్తోందని ఫ్రాన్స్ సంచలన ఆరోపణలు చేసింది. వివిధ దేశాల్లోని చైనా రాయబార కార్యాలయాల్లో పనిచేసే రక్షణ రంగ ప్రతినిధులు ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారని, రఫేల్ విమానాలను కొనుగోలు చేయవద్దని, వాటి స్థానంలో చైనా తయారీ జెట్లను ఎంచుకోవాలని ఇతర దేశాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఫ్రెంచ్ నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఈ దుష్ప్రచారంలో భాగంగా, గత మే నెలలో భారత్‌తో జరిగిన ఘర్షణలో మూడు రఫేల్ విమానాలతో సహా ఐదు భారత విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ చేసిన వాదనలను చైనా వాడుకుంటోందని ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. అయితే, ఈ వాదనలను రఫేల్ తయారీ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారని, రఫేల్ శిథిలాలని చూపిస్తూ మార్ఫింగ్ చేసిన ఫోటోలు, ఏఐ కంటెంట్, వెయ్యికి పైగా ఫేక్ సోషల్ మీడియా ఖాతాలతో చైనా టెక్నాలజీ గొప్పదనే భావనను వ్యాప్తి చేస్తున్నారని ఫ్రాన్స్ పేర్కొంది. రఫేల్ కేవలం ఒక యుద్ధ విమానం మాత్రమే కాదని, అది ఫ్రాన్స్ వ్యూహాత్మక సామర్థ్యానికి, విశ్వసనీయతకు ప్రతీక అని, అందుకే దాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని ఫ్రెంచ్ రక్షణ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

మరోవైపు, ఫ్రాన్స్ చేస్తున్న ఆరోపణలను చైనా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన పుకార్లు, పరువు నష్టం కలిగించే చర్యలని కొట్టిపారేసింది. సైనిక ఉత్పత్తుల ఎగుమతి విషయంలో తాము ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది.
Rafale
China
France
Rafale fighter jets
Dassault Aviation
Eric Trappier
Chinese disinformation
India
Military exports
Defense

More Telugu News