Aakash Deep: అక్క కోసం అద్భుతం చేశాడు... విజయాన్ని కన్నీళ్లతో సోదరికి అంకితమిచ్చిన ఆకాశ్ దీప్

Akash Deep dedicates historic Edgbaston win to sister battling cancer in heartfelt revelation
  • ఇంగ్లండ్‌పై చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్ దీప్
  • క్యాన్సర్‌తో బాధపడుతున్న సోదరికి తన విజయాన్ని అంకితం
  • మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు సృష్టించిన పేస‌ర్‌
  • రెండు నెలలుగా సోదరి అనారోగ్యంతో బాధపడుతోందని వెల్లడి
  • ఆమె ముఖంలో సంతోషం చూడటానికే ఆడానని భావోద్వేగం
ఇంగ్లండ్‌పై చారిత్రక టెస్టు విజయం సాధించిన వేళ, టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ తన ఆనందాన్ని పంచుకోలేదు, గుండెల్లో దాచుకున్న భారాన్ని పంచుకున్నాడు. తాను మైదానంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పుడు తన సోదరి క్యాన్సర్‌తో పోరాడుతోందన్న నిజాన్ని ప్రపంచానికి వెల్లడించి అందరినీ భావోద్వేగానికి గురిచేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై సాధించిన చిరస్మరణీయ విజయాన్ని తన సోదరికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు.

ఈ మ్యాచ్ అనంతరం సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆకాశ్ దీప్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. "ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. మా అక్క గత రెండు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. నా ప్రదర్శన చూసి అందరికంటే తనే ఎక్కువ సంతోషిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ మ్యాచ్‌ను ఆమెకే అంకితం ఇస్తున్నా. ఆమె ముఖంలో చిరునవ్వు చూడాలనుకుంటున్నాను" అని తెలిపాడు. గద్గద స్వరంతో, "ఇది నీకోసమే. నేను బంతిని చేతిలోకి తీసుకున్న ప్రతిసారీ నీ ముఖమే నా మదిలో మెదిలింది. మేమంతా నీతోనే ఉన్నాం" అని అన్నాడు.

నిజానికి ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఆకాశ్ దీప్ శిక్షణా శిబిరాల్లో కాకుండా, ఆస్పత్రి కారిడార్లలో తన సోదరి బాగోగులు చూసుకుంటూ గడిపాడు. ఒకవైపు జాతీయ జట్టులో స్థానం దక్కిన ఆనందం, మరోవైపు సోదరి అనారోగ్యం తనను మానసికంగా కుంగదీశాయని, అయినా ధైర్యంగా నిలబడ్డానని చెప్పాడు.

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆకాశ్ దీప్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు సహా మొత్తం 187 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో 1986లో చేతన్ శర్మ (10/188) నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్ గడ్డపై ఒక భారత బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ టెస్ట్ గణాంకాలు ఇవే కావడం విశేషం. అంతేకాకుండా ఇంగ్లండ్‌లో 10 వికెట్ల ఘనత సాధించిన రెండో భారత పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. అతని ప్రదర్శన భారత్‌కు ఎడ్జ్‌బాస్టన్‌లో మొట్టమొదటి టెస్టు విజయాన్ని అందించింది.
Aakash Deep
India vs England
Aakash Deep sister
cancer
Edgbaston Test
Indian cricket
cricket
sports
Chetan Sharma
England tour

More Telugu News