Ravindranath Reddy: టీడీపీకి ‘రప్పా రప్పా’ సినిమా చూపిస్తాం.. వైసీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ravindranath Reddy Warns TDP Will Show Rappa Rappa Movie If YSRCP Wins
  • ప్రతి వైసీపీ కార్యకర్త ప్రత్యర్థుల పేర్లతో బుక్‌ తెరవాలని పిలుపు
  • అధికారంలోకి వచ్చాక ఎక్కువ కేసులు ఉన్నవారికే ప్రాధాన్యమని వ్యాఖ్య
  • త్వరలో జమిలి ఎన్నికలు, జగన్‌ 2.0 రావడం ఖాయమన్న రవీంద్రనాథ్‌రెడ్డి
  • కడపలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు
వైసీపీ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నాయకులకు "రప్పా రప్పా.. సినిమా చూపిస్తాం" అని హెచ్చరించారు. ప్రతి వైసీపీ కార్యకర్త ఒక బుక్‌ తెరిచి, అందులో టీడీపీ నేతల పేర్లు రాసుకోవాలని, అధికారంలోకి రాగానే ఆ జాబితా ప్రకారం వారి సంగతి చూస్తామని అన్నారు.

ఆదివారం వైఎస్ఆర్‌ కడప జిల్లా కేంద్రంలో నిర్వహించిన వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయని, వాటిలో వైసీపీ ఘన విజయం సాధించి 'జగన్ 2.0' పాలన మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరిపై ఎక్కువ కేసులుంటే అధికారంలోకి వచ్చాక వారికి అంత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.

మేనిఫెస్టోను అమలు చేయని టీడీపీ నాయకులను ప్రతిచోటా చొక్కా పట్టుకుని నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైసీపీ సీనియ‌ర్ నేత‌ అంజాద్‌బాషా మాట్లాడుతూ, నగరపాలక ఎన్నికల్లో 50 డివిజన్లూ ఏకగ్రీవం చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్న మాటలు నిజం కావని, ఒక్క డివిజన్‌ను కూడా వారు గెలవలేరని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్‌ సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Ravindranath Reddy
YSRCP
TDP
Andhra Pradesh Politics
Kadapa District
Jagan Mohan Reddy
Kamalapuram
YSR Kadapa
Elections
Political Controversy

More Telugu News