Ding Yuanzhao: ఆక్స్ఫర్డ్ లో చదివి ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా.. నెట్టింట‌ చైనా యువకుడి కథ వైరల్!

Ding Yuanzhao Oxford Graduate Working as Food Delivery Agent Story Goes Viral
  • 39 ఏళ్ల డింగ్ యువాన్ఝావో కథ సోషల్ మీడియాలో వైరల్
  • ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో డిగ్రీలు, పీహెచ్‌డీలు
  • సరైన ఉద్యోగం దొరక్క డెలివరీ ఏజెంట్‌గా మారిన వైనం
  • ఈ ఉద్యోగం స్థిరమైందని, కుటుంబాన్ని పోషిస్తోందని వెల్లడి
  • పనితో పాటు వ్యాయామం కూడా అవుతోందన్న డింగ్
ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించి, పీహెచ్‌డీ పూర్తి చేసిన వ్యక్తి.. చివరికి ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చైనాకు చెందిన 39 ఏళ్ల డింగ్ యువాన్ఝావో కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అత్యంత విద్యావంతుడైన ఫుడ్ డెలివరీ ఉద్యోగిగా ఆయన నెట్టింట చర్చనీయాంశమయ్యారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, డింగ్ యువాన్ఝావో విద్యార్హతలు చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఆయన చైనాలోని ప్రతిష్ఠాత్మక సింఘువా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ, పెకింగ్ యూనివర్సిటీ నుంచి ఎనర్జీ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. అంతటితో ఆగకుండా సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి బయాలజీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. అంతేకాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బయోడైవర్సిటీలో మరో డిగ్రీ కూడా సంపాదించారు.

ఇన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ డింగ్‌కు ఉద్యోగ వేటలో తీవ్ర నిరాశే ఎదురైంది. పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలకు హాజరైనా సరైన ఉద్యోగం సంపాదించలేకపోయారు. గతంలో సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్‌గా పనిచేసినా, ఆ తర్వాత స్థిరమైన ఉపాధి దొరక్క ఫుడ్ డెలివరీ రైడర్‌గా మారారు.

తన ప్రస్తుత ఉద్యోగంపై డింగ్ సానుకూలంగా స్పందించారు. "ఇది స్థిరమైన ఉద్యోగం. ఈ ఆదాయంతో నా కుటుంబాన్ని పోషించుకోగలను. కష్టపడి పనిచేస్తే మంచి జీవనం గడపవచ్చు. ఇది చెడ్డ పనేమీ కాదు. ఫుడ్ డెలివరీ చేయడం వల్ల పనితో పాటు వ్యాయామం కూడా పూర్తవుతుంది. ఇది ఒక ప్రయోజనం" అని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. విద్యార్హతలను బట్టి వ్యక్తుల విలువను అంచనా వేయలేమని, చాలా మంది చివరికి ఇలాంటి పనుల్లోనే స్థిరపడతారని డింగ్‌ అభిప్రాయపడ్డారు. ఈ పని ద్వారా తన కుటుంబాన్ని పోషించడమే కాకుండా సమాజానికి సేవ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
Ding Yuanzhao
China
Oxford University
food delivery agent
PhD
job search
education
viral story
unemployment
Singapore

More Telugu News