PM Modi: ఉగ్రవాద బాధితులను, మద్దతుదారులను ఒకేలా చూడలేం: బ్రిక్స్ వేదికగా పాక్‌పై మోదీ ఘాటు వ్యాఖ్యలు

PM Modis Scathing Attack On Pakistan At BRICS For Supporting Terror
  • బ్రిక్స్ సదస్సులో పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
  • జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించిన బ్రిక్స్ దేశాలు
  • ఉగ్రవాదంపై పోరుకు కట్టుబడి ఉన్నామని సంయుక్త ప్రకటన
  • 2026లో బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్
ఉగ్రవాద బాధితులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని ఒకే తక్కెడలో తూయలేమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం విషయంలో కొందరు తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.

ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి పీఓకేతో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను, సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకుందని భారత్ ఎప్పటినుంచో ఆధారాలతో సహా ఆరోపిస్తున్న విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశారు. ప‌హల్గామ్ దాడిని ఖండించి, భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

పహల్గామ్ దాడిని ఖండించిన బ్రిక్స్
ఈ సదస్సు ముగింపు సందర్భంగా బ్రిక్స్ దేశాలు 'రియో డి జనీరో డిక్లరేషన్' పేరుతో ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ఈ ప్రకటన తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దానికి ప్రేరణ ఏదైనా, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు పాల్పడినా అది నేరమేనని, అన్యాయమని పునరుద్ఘాటించింది. సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులను, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని, వారికి సురక్షిత స్థావరాలు కల్పించడాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటామని బ్రిక్స్ దేశాలు ప్ర‌క‌టించాయి.

అయితే, ఈ సంయుక్త ప్రకటనలో పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. కాగా, 2017లో చైనాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి పాక్ ఉగ్రసంస్థల పేర్లను పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా, 2026లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
PM Modi
BRICS Summit
Pakistan Terrorism
Pahalgam Attack
Rio de Janeiro Declaration
India Pakistan relations
Counter Terrorism
Jammu Kashmir
Operation Sindoor
Terrorist safe havens

More Telugu News