Shubman Gill: కోహ్లీ, కపిల్‌లకూ సాధ్యం కాని ఘనత.. ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన గిల్

Shubman Gill Creates History at Edgbaston India Wins Test
  • ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో భారత్ ఘ‌న విజ‌యం
  • ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్టు గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డు
  • కోహ్లీ, కపిల్, ఇమ్రాన్ ఖాన్ వంటి దిగ్గజ కెప్టెన్లకు సాధ్యం కాని ఘనత గిల్ పేరిట‌
  • రెండు ఇన్నింగ్స్‌లలో అదరగొట్టిన కెప్టెన్ గిల్
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టడంతో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 336 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఈ గెలుపుతో ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ వంటి దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాని ఈ ఘనతను గిల్ తన పేరున లిఖించుకున్నాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు, ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకే ఆలౌట్ అయింది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ కెప్టెన్ గిల్ మ‌ళ్లీ అద్భుత శతకం (161)తో రాణించాడు. అత‌నికి తోడుగా రిషభ్ పంత్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలతో చెల‌రేగ‌డంతో భారత్ 427 పరుగుల వ‌ద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్‌ చేసింది. దీంతో ఆతిథ్య జ‌ట్టు ముందు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ పూర్తిగా చేతులెత్తేసింది. 

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనను త్రుటిలో కోల్పోయిన ఆకాశ్ దీప్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడుగా సిరాజ్, జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీయడంతో ఇంగ్లీష్ జ‌ట్టు ఘోర పరాజయం పాలైంది.
Shubman Gill
India vs England
Edgbaston Test
Shubman Gill captaincy
India Test win
Asia captain record
Virat Kohli
Kapil Dev
Cricket
Test Series 2024

More Telugu News