Telangana Police: గంజాయి కేసుల్లో కొత్త టెక్నాలజీ.. స్పాట్‌లోనే టెస్టులతో పట్టేస్తున్న పోలీసులు!

Telangana Police Using New Tech to Detect Ganja Users
  • గంజాయి నిర్మూలనకు పోలీసుల సరికొత్త వ్యూహం
  • రంగంలోకి యూరిన్ టెస్ట్ కిట్లు.. స్పాట్‌లోనే పరీక్షలు
  • గంజాయి సేవించిన వారిని నిమిషాల్లో గుర్తింపు
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభమైన వినియోగం
  • పాజిటివ్‌ వస్తే నేరుగా పునరావాస కేంద్రానికి తరలింపు
తెలంగాణ‌లో గంజాయి దందాను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ మరో కీలక అడుగు ముందుకేసింది. గంజాయి సరఫరాదారులతో పాటు దానిని వినియోగించే వారిని కూడా గుర్తించేందుకు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీని ప్రయోగిస్తున్నారు. గంజాయి సేవించారా? లేదా? అని స్పాట్‌లోనే తేల్చేసేందుకు వీలుగా యూరిన్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తెచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. జిల్లా పరిధిలోని చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్, యాదగిరిగుట్ట వంటి కీలక పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం ఈ యూరిన్ కిట్లను సరఫరా చేసింది. అనుమానం ఉన్న వ్యక్తుల మూత్ర నమూనాలను ఈ కిట్ల ద్వారా పోలీసులు పరీక్షిస్తున్నారు. పరీక్షలో పాజిటివ్‌గా తేలితే, ఆ వ్యక్తి గంజాయి సేవించినట్లు నిర్ధారించి, తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల భువనగిరి పట్టణంలో ఓ వ్యక్తికి ఇలాగే పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది.

ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిని కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా వారిని మత్తు నుంచి బయటపడేసేందుకు పునరావాస కేంద్రాలకు (రిహాబిలిటేషన్ సెంటర్లకు) పంపిస్తున్నారు. మరింత కచ్చితమైన నిర్ధారణ కోసం వారి రక్త నమూనాలను కూడా సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ఈ విధానం ద్వారా గంజాయి వినియోగదారులను గుర్తించడమే కాకుండా వారికి గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే కీలక సమాచారాన్ని రాబట్టి, గంజాయి నెట్‌వర్క్ మూలాలను నిర్మూలించాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Telangana Police
Ganja
Urine Test Kits
Drug Abuse
Yadadri Bhuvanagiri
Rehabilitation Centers
Drug Network
Telangana Crime
Narcotics

More Telugu News