Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1: రిషబ్ బర్త్‌డే గిఫ్ట్.. అదిరిన కొత్త లుక్, రిలీజ్ డేట్ ఫిక్స్!

Rishab Shetty Kantara Chapter 1 Release Date Fixed
  • రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా 'కాంతార చాప్టర్ 1' కొత్త పోస్టర్ విడుదల
  • వీరోచితమైన, పవర్‌ఫుల్ లుక్‌తో ఆకట్టుకుంటున్న రిషబ్
  • అక్టోబర్ 2న సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటన
  • కన్నడతో పాటు తెలుగు, హిందీ సహా మొత్తం 7 భాషల్లో రిలీజ్‌కు సన్నాహాలు
కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయ‌న‌ అభిమానులకు మేక‌ర్స్ అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘కాంతార: ఏ లెజెండ్ – చాప్టర్ 1’ నుంచి ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దీంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార’ చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రిషబ్ శెట్టి వీరోచితమైన లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ఆయన ముఖం స్పష్టంగా కనిపించలేదు. కానీ ఈ కొత్త పోస్టర్‌లో ఆయన పవర్‌ఫుల్ అవతారం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. తొలి భాగం ఊహించని విజయం సాధించడంతో ఈ ప్రీక్వెల్‌ను కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘కాంతార’కు అద్భుతమైన సంగీతం అందించిన అజనీశ్‌ లోక్‌నాథ్ ఈ చిత్రానికి కూడా స్వరాలు సమకూరుస్తున్నారు. 
Kantara Chapter 1
Rishab Shetty
Kantara prequel
Hombale Films
Ajaneesh Loknath
Kannada movie
Indian cinema
Gandhi Jayanthi
October 2 release
Pan India movie

More Telugu News