Quantum Technology: అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ టెస్ట్ బెడ్

Quantum Valley Declaration Approved for Amaravati Development
  • గేట్ వే హబ్‌గా అమరావతి అభివృద్ధికి ఏపీ ప్రభుత్వ ఆమోదం
  • క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ 
  • కీలక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • ఏడాదిలోగా అమరావతిలో 'క్యూ-చిప్-ఇన్'
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతిని 'క్వాంటమ్ గేట్ వే హబ్'‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన 'క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్'కు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది.

గత నెల జూన్ 30న విజయవాడలో జరిగిన క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో ఈ డిక్లరేషన్‌ను రూపొందించారు. ఈ డిక్లరేషన్ కు ఆమోదం తెలపడం ద్వారా అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా, దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ టెస్ట్ బెడ్ అయిన 'క్యూ-చిప్-ఇన్'‌ను రాబోయే 12 నెలల్లోగా అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన పరిశోధన, ఆవిష్కరణలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ నిర్ణయంతో భవిష్యత్ టెక్నాలజీ రంగంలో అమరావతి కీలక పాత్ర పోషించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Quantum Technology
Amaravati
Quantum Valley Declaration
Q-Chip-In
Andhra Pradesh
Quantum Test Bed
Vijayawada
Technology Hub
AP Government

More Telugu News