Perni Nani: కేసులకు భయపడేది లేదు... జగన్ జెండా వదిలేది లేదు: పేర్ని నాని

Perni Nani Says Not Afraid of Cases Will Not Leave Jagan
  • సత్తెనపల్లి పోలీసుల విచారణకు హాజరైన పేర్ని నాని
  • అధికార పార్టీ ఒత్తిడితోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణ
  • పోలీసులు అమాయకులు, బదిలీలకు భయపడుతున్నారని వెల్లడి
  • రాష్ట్రంలో సైకో, నరకాసుర పాలన అంటూ తీవ్ర విమర్శలు
"ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా భయపడేది లేదు. జగన్ జెండాను వదిలే ప్రసక్తే లేదు" అంటూ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని అధికార కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనపై నమోదైన కేసు విచారణలో భాగంగా సోమవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కు హాజరైన పేర్ని నాని... విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అధికార పార్టీ ఒత్తిడితోనే కేసులు..!

"గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెంటపాళ్ల గ్రామంలో పర్యటించినప్పుడు నేను కూడా ఆయన వెంట ఉన్నాను. కేవలం మూడు కార్లలో వెళ్లిన వంద మందిలో ఒకడినైన నాపై ఏకంగా 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమే," అని పేర్ని నాని ఆరోపించారు. ఈ కేసులో సత్తెనపల్లి పోలీసుల తప్పేమీ లేదని, వారు కేవలం పైనుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తున్నారని అన్నారు. "అధికార పార్టీ నేతలు చెప్పినట్టు వినకపోతే బదిలీలు చేస్తామని, సస్పెండ్ చేస్తామని పోలీసులను భయపెడుతున్నారు. ఆ ఒత్తిడితోనే వారు అమాయకులపై కేసులు పెట్టాల్సి వస్తోంది" అని నాని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో సైకో, నరకాసుర పాలన!

రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన సాగడం లేదని, సైకో, నరకాసుర పాలన నడుస్తోందని పేర్ని నాని తీవ్రంగా ధ్వజమెత్తారు. "ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలనే దురుద్దేశంతోనే ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నన్ను మహా అయితే బందరు నుంచి సత్తెనపల్లికి తిప్పుతారు, అంతకుమించి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇలాంటి బెదిరింపులకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడరు" అని స్పష్టం చేశారు.



Perni Nani
YS Jagan
YSRCP
Andhra Pradesh Politics
Sattenapalli
Police Case
Political Vendetta
TDP Government
Jagan Mohan Reddy
YS Jagan Party

More Telugu News