YS Sharmila: వైఎస్సార్ ఆర్కిటెక్చర్ వర్సిటీ వివాదం...చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలన్న షర్మిల

YS Sharmila Demands Answer on YSR Architecture University Issue
  • వైఎస్సార్ ఆర్కిటెక్చర్ వర్సిటీ విద్యార్థుల ఆందోళనకు షర్మిల మద్దతు
  • సీఓఏ గుర్తింపు లేకుండా అడ్మిషన్లపై యాజమాన్యాన్ని నిలదీత
  • గత వైసీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ
  • జగన్, అవినాశ్‌తో పాటు చంద్రబాబు, పవన్‌పైనా విమర్శలు
  • విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్
వైఎస్సార్ కడప జిల్లాలోని ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, దీనికి గత వైసీపీ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని... దీనికి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. వర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆమె సోమవారం మద్దతు తెలిపి, వారి సమస్యలపై తీవ్రంగా స్పందించారు.

కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీవోఏ) నుంచి తప్పనిసరి అనుమతులు లేకుండా 2020లో విద్యార్థులను ఎలా చేర్చుకున్నారని ఆమె యూనివర్సిటీ యాజమాన్యాన్ని నిలదీశారు. "ఒక్కో విద్యార్థి సుమారు రూ.15 లక్షలు ఖర్చుపెట్టి ఐదేళ్ల కోర్సు పూర్తి చేయబోతున్నారు. ఈ సమయంలో వారి సర్టిఫికెట్లకు విలువ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నెలకొనడం అత్యంత బాధాకరం" అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యకు మాజీ ముఖ్యమంత్రి జగన్, స్థానిక ఎంపీ అవినాశ్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. "అధికారంలో ఉన్నప్పుడు సీఓఏ అనుమతుల కోసం వారెందుకు ప్రయత్నించలేదు? ఢిల్లీలోనే ఉండే సీఓఏతో ఎంపీ అవినాశ్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు?" అని ఆమె ప్రశ్నించారు.

అదే సమయంలో, గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఉందని షర్మిల స్పష్టం చేశారు. "కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయినా ఈ చిన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? విద్యార్థుల సర్టిఫికెట్లకు విలువ లేకపోతే వారి భవిష్యత్తు ఏమిటి? అని నిలదీశారు. విద్యార్థుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆమె తెలిపారు.
YS Sharmila
YSR Architecture University
Andhra Pradesh
Chandrababu Naidu
Pawan Kalyan
COA
Council of Architecture
KADAPA
Jagan Mohan Reddy
Avinash Reddy

More Telugu News