18న కరీంనగర్ లో ఐటీ హబ్ ప్రారంభిస్తున్నాం: కేటీఆర్

  • నిజామాబాద్, ఖమ్మం,మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా కంపెనీలు వస్తాయి
  • టీ హబ్ రెండో దశ త్వరలో పూర్తి
  • తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమ విస్తరణ
తమ ప్రభుత్వం ఐటీ పరిశ్రమను రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఆయన పరిశ్రమలు, ఐటీ శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే వరంగల్ నగరంలో పలు కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించడానికి సంసిద్ధత తెలిపాయన్నారు.

 తమ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోకి వచ్చే కంపెనీలకోసం మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేసి సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. కరీంనగర్ ఐటీ హబ్ ను ఈ నెల 18న ప్రారంభించనున్నట్లు చెబుతూ.. ఇదే రీతిలో నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లోనూ కంపెనీలు ఏర్పాటయ్యేలా చూస్తామన్నారు.

వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. తెలంగాణ పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పన సంస్థ ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న ఇండస్ట్రియల్ పార్కులు.. వసతుల కల్పనపై వివరాలను తెలుసుకున్నారు. టీ హబ్ రెండో దశ త్వరలోనే పూర్తవుతుందన్నారు.


More Telugu News