అమెరికా స్థావరంపై మరోసారి రాకెట్లతో దాడి

  • ఇరాక్ లోని కే1 స్థావరంపై నిన్న రాత్రి రాకెట్లతో దాడి
  • డిసెంబర్ 27న ఇదే స్థావరంపై 30 రాకెట్లతో దాడి
  • అమెరికా, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం
ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరంపై నిన్న రాత్రి మరోసారి రాకెట్లతో దాడి జరిగింది. కిర్కుక్ ప్రావిన్సులో అమెరికా బలగాలు ఉన్న కే1 స్థావరంపై కత్యుషా రాకెట్లతో దాడి చేశారు. అయితే, ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. గత డిసెంబర్ 27న ఇదే స్థావరంపై రాకెట్లతో దాడి చేశారు. దాదాపు 30 రాకెట్లను ప్రయోగించారు. ఆ దాడుల్లో అమెరికాకు చెందిన ఒక ఉన్నతాధికారి మరణించారు. దీనికి కారణం హెజ్బోలా ఉగ్రవాద సంస్థ అని అప్పట్లో అమెరికా ఆరోపించింది. ఆ తర్వాత అమెరికా జరిపిన ప్రతీకార దాడుల్లో 25 మంది హెజ్బోలా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా హతం చేసిన తర్వాత... ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో, ఇరాన్ కు చెందిన పలు ఉగ్ర సంస్థలు అమెరికా స్థావరాలపై దాడులకు దిగుతున్నాయి. తాజా దాడుల నేపథ్యంలో, ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


More Telugu News