స్వస్తివాచనంతో యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

  • పదకొండు రోజులపాటు స్వామి సన్నిధిలో ఉత్సవ సందడి 
  • ఈరోజు నుంచి మార్చి ఏడు వరకు నిర్వహణ 
  • మార్చి 4న స్వామి వారి కల్యాణోత్సవం

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక ఆలయంగా భావిస్తున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు స్వస్తివాచనంతో మొదలుకానున్నాయి. ఉదయం 10 గంటలకు యాదాద్రి కొండపై ఉన్న బాలాలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.

మార్చి ఏడో తేదీ వరకు పదకొండు రోజులపాటు ఆలయ సన్నిధిలో ఉత్సవ సందడికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అదే సమయంలో ఈ పదకొండు రోజులు భక్తులతో జరిపే శాశ్వత కల్యాణం, మొక్కు కల్యాణం, సుదర్శన హోమం వంటి కార్యక్రమాలను రద్దు చేశారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉత్సవాలకు అందరు దేవుళ్లను ఆహ్వానిస్తూ జరిపే ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 28న శేషవాహన సేవ, 29న హంసవాహన సేవ, మార్చి 1న పొన్న వాహన సేవ, 2న సింహవాహన సేవలు ఉంటాయి. అన్ని వాహన సేవలు సాయంత్రం 9 గంటలకు మొదలవుతాయి. మార్చి 3న ఎదుర్కోలు, 4న కల్యాణం, 5న రథోత్సవం, ఆరున చక్రస్నానం జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం స్వామి వారి కల్యాణోత్సవం. మార్చి 4వ తేదీన ఉదయం 10 గంటలకు బాలాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా భక్తులంతా కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వీలుగా సమీపంలోని ఉన్నత పాఠశాల మైదానంలో సాయంత్రం 8 గంటలకు మరోసారి నిర్వహిస్తారు. ఐదో తేదీ ఉదయం 7 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది.

మరునాడు ఆరో తేదీన మహాపూర్ణాహుతి, ఉదయం 10.30 గంటలకు స్వామివారి చక్రతీర్థ స్నానఘట్టాన్ని నిర్వహిస్తారు.  మార్చి ఏడో తేదీన జరిగే అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవ సంరంభం ముగియనుంది. 



More Telugu News