వదంతులకు చెక్.. ‘టైగర్ జిందా హై’ క్యాప్షన్‌తో వీడియో పోస్టు చేసిన అమర్ సింగ్

  • సింగపూర్ ఆసుపత్రి బెడ్ పైనుంచి మాట్లాడిన ఎస్పీ నేత
  • తాను చనిపోతానన్న ఆశలు వదులుకోవాలని సూచన
  • తన చావును కోరుకుంటున్న అందరికీ శతకోటి ధన్యవాదాలన్న అమర్‌సింగ్
తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అమర్‌సింగ్ చెక్ పెట్టారు. తాను బాగానే ఉన్నానని, కాకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నానని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. దానికి ‘టైగర్ జిందా హై’ అని క్యాప్షన్ తగిలించారు. తాను చనిపోయినట్టు కొందరు వదంతులు వ్యాపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చాలాసార్లు మృత్యుముఖం దగ్గరగా వెళ్లి వెనక్కి వచ్చినట్టు చెప్పారు.

సింగపూర్ నుంచి మాట్లాడుతున్నట్టు పేర్కొన్న అమర్‌సింగ్..  తాను అనారోగ్యంతో బాధపడుతున్నా.. నమ్మకం, ఉత్సాహం మాత్రం అలానే ఉన్నాయని పేర్కొన్నారు. అమ్మవారి కృప ఉంటే రెండింతల శక్తితో తిరిగి మీ ముందుకు వస్తానని అన్నారు. అయితే, తాను చనిపోతానని కొందరు వదంతులు వ్యాపింపజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మృతిని కోరుకుంటున్న మిత్రులు అలాంటి ఆశలు వదులుకోవాలని సూచించారు.

ఒకసారి విమాన ప్రమాదం నుంచి, పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన మెదడు పదేళ్ల పిల్లాడి కంటే ఉత్సాహంగా పనిచేస్తోందన్న అమర్‌సింగ్.. తన మృత్యువును కోరుకుంటూ వదంతులు ప్రచారం చేస్తున్న అందరికీ శతకోటి ధన్యవాదాలని ముగించారు.


More Telugu News