ఇటువంటి అసత్య ఆరోపణలతో రాష్ట్రాన్ని నిందించకండి: దర్శకుడు హరీశ్ శంకర్ ఆగ్రహం

  • సైబరాబాద్‌లో తన హోటల్‌ బాల్కనీ పూర్తిగా పాడైపోయిందన్న శేఖర్ గుప్తా
  • విద్యుత్‌ సరఫరా అంతరాయంతో ఇబ్బందులని వ్యాఖ్యలు
  • చెడు ప్రచారం చేయాలనుకుంటే మంచి కథను ఎంచుకోండన్న హరీశ్ శంకర్‌
  • ఇప్పటివరకు తాము 'పవర్‌ ఫుల్‌' గా ఉన్నామని ట్వీట్
హైదరాబాద్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే సైబరాబాద్‌లో ఉన్న తన హోటల్‌ బాల్కనీ పూర్తిగా పాడైపోయి ఇలా ఉందంటూ ప్రముఖ జర్నలిస్ట్, దిప్రింట్‌ వ్యవస్థాపకుడు శేఖర్‌ గుప్తా తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. విద్యుత్‌ సరఫరాకు ఆటంకాల కారణంగా ఐటీ పార్కుకు పెద్ద పెద్ద డీజిల్‌ సెట్స్‌లను బాగా వినియోగిస్తుండడంతో గొట్టాల నుంచి వస్తోన్న పొగతో ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. కాలుష్యం, వ్యర్థాలు, శబ్దాలు ఎక్కువయ్యాయని తెలిపారు. కిటికీలను కూడా దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.  

దీనిపై స్పందించిన సినీ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు చెడు ప్రచారం చేయాలనుకుంటే మంచి కథను ఎంచుకుని చేయండి.. అంతేగానీ, ఇటువంటి అసత్య ఆరోపణలతో రాష్ట్రాన్ని నిందించకండి. టీఆర్‌ఎస్‌ పార్టీ సారథ్యంలో ఇప్పటివరకు మేము 'పవర్‌ ఫుల్‌' గా ఉన్నాం' అని హరీశ్‌ శంకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. కాగా, తెలంగాణలో 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ అందుతోందని నెటిజన్లు అంటున్నారు. అటువంటప్పుడు శేఖర్‌ గుప్తా ఇటువంటి వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీస్తున్నారు.


More Telugu News