ఆటకు బై చెప్పిన క్రికెటర్ వసీం జాఫర్!

  • రిటైర్మెంట్ ప్రకటించిన ఫస్ట్ క్లాస్ దిగ్గజం వసీం జాఫర్ 
  • అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన 
  • రంజీ ట్రోఫీలో అనేక రికార్డులు నెలకొల్పిన జాఫర్  
  • భారత్ తరఫున 31 టెస్టుల్లో ప్రాతినిధ్యం
టీమిండియా మాజీ  ఓపెనర్, దేశవాళీ దిగ్గజ ఆటగాడు వసీం జాఫర్  క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించాడు. దాదాపు 25 సంవత్సరాల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పరుగుల మోత మోగించిన 42 ఏళ్ల జాఫర్.. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు శనివారం తెలిపాడు.  

భారత్ తరఫున 31 టెస్టులు ఆడిన జాఫర్ 1944 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 212. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 260 మ్యాచ్ లు ఆడిన అతను ఏకంగా 19,410 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో 150 మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా నిలిచిన జాఫర్ ముంబైని రెండు సార్లు విజేతగా నిలిపాడు. అలాగే, గత మూడు సీజన్ల నుంచి విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించి రెండు టైటిళ్లు అందించాడు.

 రంజీ ట్రోఫీలో రికార్డు మోత

1996-97 సీజన్ లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన ఈ వెటరన్ క్రికెటర్ రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. రంజీ ట్రోఫీలో అత్యధికంగా 156 మ్యాచ్ లు ఆడాడు. ఈ టోర్నీలో అతను చేసిన 12, 038 పరుగులు ఓ క్రికెటర్ కు అత్యుత్తమం. అలాగే, అత్యధిక సెంచరీలు (40), అర్ధ శతకాలు (89), క్యాచ్ ల (200) రికార్డు కూడా అతని పేరిటే ఉంది.

సచిన్ నాకు ఆదర్శం: జాఫర్

బీసీసీఐ, ముంబై క్రికెట్ సంఘం, విదర్భ క్రికెట్ సంఘాలకు ధన్యవాదాలు తెలిపిన జాఫర్.. భారత క్రికెట్ టెస్టు క్యాప్ అందుకోవడం, పాకిస్థాన్ పై 202, వెస్టిండీస్ పై 212 పరుగుల స్కోర్లు చేయడం తన జీవితంలో మరిచిపోలేని క్షణాలని చెప్పాడు. సచిన్ టెండూల్కర్ తనకు ఆదర్శం అన్నాడు. రాహుల్ ద్రవిడ్, సౌరవ్, గంగూలీ, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ లాంటి క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు.


More Telugu News