కుల విష సర్పం నేడు సిగ్గు విడిచి, కొత్త దర్పం చూపిస్తోంది: మారుతీరావు ఆత్మహత్యపై నటి మాధవీలత

  • ఆయనకు బంగారం లాంటి కూతురు..  అల్లుడు, పండంటి మనవడు
  • అందమైన జీవితాన్ని గడపకుండా కులమే అడ్డుగోడలు సృష్టించింది
  • కూతురిని జీవితకాలపు విషాదంలోకి నెట్టివేసింది
  • ఆయన భార్యను శోకంలో ముంచింది 
బంగారం లాంటి కూతురు..  అల్లుడు, పండంటి మనుమడితో అందమైన జీవితాన్ని గడపకుండా కులమే అడ్డుగోడలు సృష్టించిందంటూ నటి మాధవీలత మారుతీరావు ఆత్మహత్యను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 'కూతురిని జీవితకాలపు విషాదంలోకి నెట్టివేసిందీ.. తన భార్యను శోకంలో ముంచిందీ.. ఈయన జీవితాన్ని నేరమయం చేసి.. శిక్ష పడక ముందే కుల సంఘం సత్రంలోనే చివరకి హరించిందీ.. పాపం ప్రేమించిన నేరానికి హత్యతో శిక్షించిందీ.. ఆ హత్య తప్పుకాదు అని మాట్లాడే దుర్మార్గులను సృష్టించిందీ కులమే.. ఇంకేమీ కాదు... కులమే' అని ఆమె పేర్కొన్నారు.

రాజకీయంలో భాగమవుతూ కులం ప్రధాన పాత్ర పోషిస్తున్నదని ఆమె చెప్పారు. వివక్షకు పునాది వేసి, ద్వేషానికి పాలు పోస్తూ, 'సామాజిక వర్గం' గా చెలామణీ అవుతున్న సామాజిక నేరం కులమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుల విష సర్పం నేడు సిగ్గు విడిచి, కొత్త దర్పం చూపిస్తున్నదని, ఒకప్పటి, నేటి, బాధితుల ద్వారానే వ్యాప్తి చెందుతున్నదని తీవ్ర విమర్శలు గుప్పించారు.


More Telugu News