ఇటలీలో ఒక్కరోజే 196 మంది మృతి.. పంజా విసురుతున్న కరోనా
ఆ దేశంలో 827కు చేరిన మృతుల సంఖ్య
12 వేలు దాటిపోయిన వైరస్ బాధితులు
హోటళ్లు, బార్లు, రెస్టారెంట్ల మూసివేత
బాధ్యతగా ఉంటే మనల్ని మనం రక్షించుకోవచ్చని ఇటలీ ప్రధాని పిలుపు
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన చైనాలో నియంత్రణలోకి రాగా, పలు దేశాల్లో మాత్రం అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఇటలీపై కరోనా పంజా విసురుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 12,462 మందికి వైరస్ సోకగా 827 మంది మరణించారు. ఇందులో బుధవారం ఒక్క రోజే 196 మంది చనిపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మృతుల సంఖ్య ఒక్క రోజులోనే 30 శాతం పెరగడం, ఒక్క రోజులోనే అదనంగా 2,200 మందికి వైరస్ సోకడంతో ఇటలీలో అత్యవసర పరిస్థితిని విధించారు.
రెస్టారెంట్లు, బార్లు అన్నీ బంద్..
కరోనా ప్రమాదకరంగా విజృంభిస్తుండటంతో ఇటలీలో దేశ వ్యాప్తంగా క్వారంటైన్ ప్రకటించారు. దీనిపై ఆ దేశ ప్రధాన మంత్రి గ్యుసెప్పి కాంటే ప్రజలకు సందేశం ఇచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతోపాటు బ్యూటీ సెలూన్ల వంటివి కూడా రెండు వారాల పాటు మూసేయాలని ఆదేశించారు. అత్యవసర సర్వీసులు, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు వంటివి మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు. అత్యవసరం కాని విభాగాలను కొంతకాలం పాటు మూసేయాలని దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలను ఆదేశించారు.
బాధ్యతగా ఉందామని పిలుపు
ప్రస్తుతమున్న పరిస్థితులలో మనల్ని మనం కాపాడుకునేందుకు బాధ్యతగా ఉందామని ప్రజలకు ఇటలీ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. దేశంలోని ఆరు కోట్ల మంది ప్రజలు ఈ మేరకు చిన్న త్యాగాలు చేయకతప్పదని.. ఇలా చేయడం వల్ల రెండు వారాల్లో పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని సూచించారు.