బీహార్ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందన

  • లాక్ డౌన్ తో  బీహార్ వలస కూలీలు హైదరాబద్ లో ఉండిపోయారు
  • వారికి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ తేజ్ ప్రతాప్ వినతి
  • మేము జాగ్రత్తగా చూసుకుంటామని బదులిచ్చిన కేటీఆర్
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోయారు. హైదరాబాద్ లో కూలీ పనుల నిమిత్తం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వలస కూలీలు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుులు, వారి తరఫున స్పందించే వ్యక్తులు వారి వంతు బాధ్యత తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కు తమ ట్వీట్ల ద్వారా విన్నవించుకున్నారు.

ఈ క్రమంలో బీహార్ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో పరిధిలోని వెంకటగిరిలో బీహార్ నుంచి వలస వచ్చిన 20 మంది కూలీలు చిక్కుకుపోయారని, వారికి ఆహారం అందేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు.  ఆ కూలీల పేర్ల జాబితాను ఈ పోస్ట్ లో జతపరిచారు. ఈ పోస్ట్ పై  కేటీఆర్  వెంటనే స్పందించారు. మేము జాగ్రత్తగా చూసుకుంటామని బదులిచ్చిన ఆయన, ఈ మేరకు తన కార్యాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అదే విధంగా, మేడ్చల్ జిల్లాలోని పంచంపల్లిలో ఒడిశాకు చెందిన వలస కూలీలు కూడా లాక్ డౌన్ కారణంగా  ఆహారం లేక  ఇబ్బంది పడుతున్నారని, దయచేసి వారికి సాయపడాలని ఓ ట్వీట్ ద్వారా కేసీఆర్ కు విజ్ఞప్తి  చేశారు. ఈ  విషయమై చర్యలు చేపట్టాల్సిందిగా మేడ్చల్ కలెక్టర్ కు సూచనలు చేశారు.

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 15 మంది గచ్చిబౌలిలో చిక్కుకుపోయారని, వారికి ఆహారం అందజేయాలని ఇంకో ట్వీట్ లో కేటీఆర్ ను కోరగా, వారిని తాము జాగ్రత్తగా చూసుకుంటామని బదులిచ్చారు.


More Telugu News