తెలంగాణలో ఇకపై పాజిటివ్ కేసులు భారీగా ఉండకపోవచ్చు!: మంత్రి ఈటల

  • కరోనా భయం రాష్ట్రంలో 95 శాతం తగ్గింది
  • ఇకపై కొత్త కేసులు నమోదు కాకపోవచ్చు
  • రాష్ట్రంలో 453కు పెరిగిన పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా తాజా పరిస్థితిని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 453 పాజిటివ్ కేసులు నమోదైనట్టు చెప్పారు. 45 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, 11 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో ఇకపై పాజిటివ్ కేసులు భారీగా నమోదు కాకపోవచ్చని మంత్రి పేర్కొన్నారు.

కరోనా భయం రాష్ట్రంలో 95 శాతం తగ్గిందన్నారు. ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన 1100 మందికి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్న మంత్రి.. వారిని కలిసిన 3,158 మందిని గుర్తించి 167 క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్టు వివరించారు. ఇంకా 535 మందికి సంబంధించిన టెస్ట్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. 397 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, వారంతా ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 49 పాజిటివ్ కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు.  

రాష్ట్రంలో పీపీఈ కిట్లకు కొరత లేదని, ఇప్పటికే 80 వేల కిట్లు ఉన్నాయని, మరో 5 లక్షల కిట్ల కోసం ఆర్డర్ ఇచ్చినట్టు తెలిపారు. అలాగే, ఎన్95 మాస్కులు లక్ష వరకు ఉన్నాయని, మరో 5 లక్షల ఫేస్‌మాస్కులు, 2 కోట్ల డాక్టర్ మాస్కులు, 5 లక్షల గాగుల్స్‌కు ఆర్డర్ ఇచ్చినట్టు మంత్రి వివరించారు. గచ్చిబౌలిలో 15 రోజుల్లోనే సిద్ధం చేసిన ఆసుపత్రిలో 1500 బెడ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని 22 ప్రైవేటు మెడికల్ కళాశాలలను ఆసుపత్రులుగా వినియోగించుకోనున్నట్టు మంత్రి ఈటల తెలిపారు.


More Telugu News